కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తోపాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా శుక్రవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో నలుగురు చనిపోగా, 20 మంది వరకు గాయపడ్డారు. కీవ్‌పై వేకువజామున జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఇద్దరు చనిపోగా, 13 మంది గాయపడ్డారు. దాడుల్లో ఒక భవనానికి నిప్పంటుకుంది. కూల్చిన క్షిపణి శకలాలు బహిరంగ ప్రదేశంలో పడిపోవడంతో సమీపంలోని వాహనాలు, భవనాల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.
నీప్రోపెట్రోవిస్క్ ప్రాంతంపై జరిగిన మరో దాడిలో ఇద్దరు చనిపోగా ఏడుగురు క్షతగాత్రులయ్యారు. పలు అపార్టుమెంట్ భవనాలు, నివాస గృహాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన 9 క్షిపణులు, 63 డ్రోన్లకు గాను నాలుగు మిస్సైళ్లు, 50 డ్రోన్లను మధ్యలోనే కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.
పేట్రియాట్‌లు కొంటాం: జెలెన్‌స్కీ
నిత్యం భయపెడుతున్న రష్యా దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు వెంటనే పేట్రియాట్ రక్షణ వ్యవస్థలను తమకు సమకూర్చాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా, యూరప్, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నగరాలకు రక్షణ కల్పించేందుకు అమెరికా నుంచి త్వరలోనే 25 పేట్రియాట్ వ్యవస్థల ను కొనుగోలు చేయనున్నామన్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అధ్యక్షతన లండన్‌లో జరుగుతున్న యూరప్ దేశాల నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక వేళ కాల్పుల విరమణ జర క్కుంటే రానున్న రోజుల్లో రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీకి వారు హామీ ఇచ్చారు.


