
శత్రువుకి శత్రువు.. మిత్రుడు. అలాగే శత్రువుకి మిత్రుడు కూడా శత్రువే కదా!. కానీ, ఆ శత్రువునే తమ మిత్రుడిగా మార్చుకునేందుకు ఆఘమేఘాల మీద చైనా చేస్తున్న ప్రయత్నాలపై ‘‘అయ్యో.. పాపం’’ అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. సీపీఈసీ ప్రాజెక్టును ఆప్ఘనిస్థాన్ వరకు పొడిగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం.
పాక్, అఫ్గనిస్తాన్ ప్రతినిధుల మధ్య బుధవారం చైనా ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఆ ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకుగానూ ఇరు దేశాల పరస్పరం రాయబారులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టు ఒప్పందం అదే విషయం. అయితే..
పాక్-అఫ్గన్ దేశాల మధ్య బంధం ఎంతటి ధృడమైందో యావత్ ప్రపంచానికి తెలుసు. అఫ్గనిస్తాన్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే అఫ్గన్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబర్‌లో అఫ్గన్ పాక్టికా ప్రావిన్స్‌లో పాక్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపై దాడి చేశామంటూ పాక్ ప్రకటించుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై అఫ్గన్ రగిలిపోతూ వస్తోంది. అలాంటిది.. ఇప్పుడు, ఈ ఇరు దేశాలు ఇప్పుడు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఎందుకీ తొందర?
2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. అయితే చైనా, పాక్, రష్యా,ఇరాన్ దేశాలు సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఉగ్రవాద లిస్ట్ నుంచి ఆ దేశాన్ని తొలగించాయి. అయితే తాలిబన్ సర్కార్‌కు గుర్తింపు ఇవ్వకున్నా.. ఆ దేశం తరఫున తమ దగ్గర రాయబారికి అనుమతించింది చైనా. ఇక..
భారత్ అఫ్గన్ తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధానాంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిపాయి. వాటిలో పురోగతి లేకున్నా.. మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టిసారిస్తూనే వస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడేందుకు దోహదపడ్డాయి.
ఈ క్రమంలోనే.. దౌత్యపరమైన సమావేశాలు గత ఏడాది కాలంలో చాలానే జరిగాయి. ఈ ఏడాది జనవరిలో భారత విదేశాగం కార్యదర్శి విక్రమ్ మిస్రీ, తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టాఖితో దుబాయ్‌లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా అమీర్ ఖాన్ ముట్టాఖితో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం.. భారత్‌లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాన్సులర్ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే అఫ్గన్ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలకు వేదికైంది. ఇది ఓర్వలేక.. కుటిల బుద్ధితో.. భారత్ వ్యతిరేకిస్తున్న సీపెక్‌లో అఫ్గన్‌ను భాగం చేసిందని, హడావిడిగా తాలిబన్లకు చైనా ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు.