పుతిన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అనతోలి రాజీనామా.. రష్యా నుంచి బయటకు?

Putin aAdvisor Quits Russian Govt Over Ukraine War, Leaves Russia - Sakshi

ఉక్రెయిన్‌పై  రష్యా యుద్థం ప్రారంభించి నెల రోజులవుతున్నా భీకర పోరు ఆగడం లేదు. ఉక్రెయిన్‌ ప్రజలు లక్షలాది మంది దేశం విడిచి వెళుతున్న రష్యా కనికరం చూపడం లేదు. వేలాది మంది సైనికులు, పౌరులు చనిపోతున్నా.. వెనక్కి తగ్గడం లేదు. ఇటు ఉక్రెయిన్‌ కూడా శత్రుదేశానికి గట్టిగా పోరాడుతోంది. నెల రోజుల యుద్ధంలో రెండు దేశాలు కోల్పోయిందే తప్ప సాధించింది ఏం లేదు. ఆఖరికి  రష్యా బలగాలు దాడులు ఆపి తమ దేశానికి తిరిగి వెళ్తే.. నాటో సభ్యత్వ డిమాండ్‌ను వదులుకుంటామని జెలెన్ స్కీ ప్రకటించినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ పై ముప్పేట దాడికి ప్రయత్నాలు చేస్తునే ఉంది. 

రష్యా సైనిక చర్యను ప్రపంచదేశాలన్నీ ఖండిస్తున్నాయి. అమెరికా సహా నాటో దేశాలు పుతిన్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ , జర్మనీ, యూరోపియన్ యూనియన్‌లు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయిప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మొండి వైఖరితోనే ముందుకెళ్తున్నారు. బయట ప్రపంచం నుంచే కాకుండా పుతిన్‌ తన సొంత దేశం నుంచి కూడా విమర్శలను మూటగట్టుకుంటున్నారు. తాజాగా పుతిన్‌కు మరో ఎదురుదెబ్బ త‌గిలింది. రష్యా పర్యావరణ దౌత్యవేత్త, పుతిన్‌ సలహాదారు అనతోలి చుబైస్ (66) తన పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఉక్రెయిన్‌పై  యుద్ధాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన రెండో అత్యున్నత రష్యా అధికారి ఈయనే కావడం విశేషం. 
చదవండి: యుద్ధం ఎఫెక్ట్‌.. పుతిన్‌ మరో సంచలన నిర్ణయం.. 

అనతోలి చుబైస్‌ రాజీనామా చేసినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి ధృవీకరించారు. అయితే దేశం విడిచిపెట్టి వెళ్లడం వెళ్లకపోవడం ఆయన ఇష్టం అని తెలిపారు. అయితే చుబైస్ ప్రభుత్వంలో పెద్దగా ప్రభావవంతమైన వ్యక్తేం కాదు. భద్రతా వ్యవహారాల్లో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ చుబైస్‌కు ఉన్న వ్యక్తిగత ప్రాముఖ్యత కారణంగా ఆయన రాజీనామా దేశంలో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక సోవియట్ విచ్ఛిన్నం తర్వాత 90వ దశకంలో రష్యా ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరైన చుబైస్.. రష్యా ప్రైవేటీకరణల రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు. అప్పటి నుంచి పుతిన్‌కి మద్దతుగా నిలిచారు.
చదవండి: రష్యా సాధించిందేమీ లేదు: పుతిన్‌ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

అయితే ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేయడం చుబైస్‌కు ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుంచి ప్రభుత్వానికి కొంత దూరంగానే వ్యవహరిస్తున్నారు. సహచరులు, స్నేహితులకు మంగళవారం రాసిన లేఖలో చుబైస్ తన రాజీనామా గురించి ప్రస్తావించినట్టు కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. గతవారం ఆర్థిక సంస్కర్త యెగోర్ గైదర్ వర్ధంతి సందర్భంగా ‘‘వ్యూహాత్మక ప్రమాదాలను నాకంటే బాగా అర్థం చేసుకున్నారు..నేను తప్పు చేశాను’’ అంటూ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేయడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top