
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని గద్దె దింపేసి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆ పదవిని చేపట్టాలని భావిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం వదంతులేనంటూ కొట్టిపారేశారు. జర్దారీ ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగుతారన్నారు.
‘ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ దేశాధ్యక్ష పదవిపై ఎన్నడూ ఆసక్తి వ్యక్తం చేయలేదు. ప్రస్తుతానికి అటువంటి ప్రణాళిక కూడా ఏదీ లేదు’అని ఆయన స్పష్టం చేశారు. మునీర్, జర్దారీ మధ్య సానుకూల సంబంధాలున్నాయి. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవముంది. పాకిస్తాన్ అభివృద్ధి, పురోగమనమే వీరిద్దరి లక్ష్యం కూడా’అని ప్రధాని వివరించారు.
‘జర్దారీ, మునీర్, షరీఫ్‌లే లక్ష్యంగా తప్పుడు జరుగుతోంది. దీని వెనుక విదేశీ శక్తులున్న సంగతి మాకు తెలుసు. జర్దారీ స్థానంలో ఆర్మీ చీఫ్ మునీర్ రానున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తి అసత్యాలు. దీనిపై ఎలాంటి చర్చలు జరగలేదు. అటువంటి యోచన కూడా లేదు’ అంటూ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్ నక్వీ ఎక్స్‌లో చేసిన ప్రకటన అనంతరం ప్రధాని ఈ మేరకు వివరణ ఇవ్వడం విశేషం. ప్రధాని పదవిని షహబాజ్‌కు, అధ్యక్ష బాధ్యతలను జర్దారీకి అప్పగించేందుకు అధికార కూటమిలో గతేడాది ఒప్పందం కుదిరింది. ఆ మేరకు జర్దారీ ఐదేళ్ల కాలానికి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అణు కార్యక్రమంపై ప్రకటన..
ఇదే సమయంలో.. భారత్‌తో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు అణు ఘర్షణలకు దారితీయొచ్చనే ఆందోళనలను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తోసిపుచ్చారు. ఇస్లామాబాద్‌లోని విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసమే వాటిని వినియోగిస్తామని వెల్లడించారు. భారత్- పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో 55 మంది తమ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ఇదిలా ఉండగా.. పహల్గాంలో పర్యాటకులపై పాశవిక ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఆ తర్వాత ఇస్లామాబాద్ ఎదురుదాడికి దిగగా.. భారత్ వాటిని సమర్థంగా అడ్డుకుంది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.