
బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. బస్సుల్లో వెళ్తున్న కొందరిని తుపాకులతో వచ్చిన దుండగులు అపహరించారు. ఆపై సమీపంలోని కొండల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు తనిఖీలు చేసి మరీ కిరాతకంగా కాల్చి చంపారు.
బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దారుణం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పలు బస్సుల నుంచి ప్రయాణికులను తుపాకులు చూపించి బెదిరించి ఎత్తుకెళ్లారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు పరిశీలించి కాల్చి చంపారు. శరీరం నిండా తుట్లతో 9 మంది ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారి ఒకరు ప్రకటించారు. ఘటనకు కారకులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. పాక్ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది. దుండగుల కోసం భద్రతాల బలగాలు రంగంలోకి దిగాయి.
ఇదిలా ఉంటే.. బలూచ్ వేర్పాటువాద మిలిటెంట్ గ్రూపులు గతంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాయి. ఇందులో బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) అత్యంత బలమైంది. అఫ్గనిస్తాన్-ఇరాన్ సరిహద్దుల గుండా ఇది స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే పాక్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది.
Pakistan Bus Attack: Gunmen Kill 9 Punjabi Passengers in Balochistan After Checking ID Cards#Balochistan #Pakistan https://t.co/seQhPWzqLJ
To get epaper daily on your whatsapp click here:
https://t.co/Y9UVm2LHAx— Free Press Journal (@fpjindia) July 11, 2025
బలూచిస్తాన్ అత్యంత అరుదైన ఖనిజాలకు మూలం. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వనరులను పంజాబ్ ప్రావిన్స్‌కు దోచిపెడుతోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్ నుంచి వాహనాలను, ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తూ వస్తోంది.
గత కొన్ని నెలలుగా బలూచిస్తాన్‌లో వరుస హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ గురైంది. బొలాన్ జిల్లాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ సుమారు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును హైజాక్ చేసింది. అందులో 30 మందిని కాల్చి చంపింది. మరో 215 మందిని బందీలుగా తీసుకుంది. బందీలలో ఎక్కువ మంది సైనికులు, పోలీసు, ISI, యాంటీ టెర్రరిజం ఫోర్స్ సభ్యులుగా ఉండడం గమనార్హం. పాక్ సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి.. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా దాడులు జరిపింది. అంతకు ముందు.. 2024 ఆగస్టులో ముసాఖేల్ జిల్లాలో 23 మంది ప్రయాణికులను ఐడెంటిటీ కార్డులు అడిగి కాల్చి చంపింది బీఎల్‌ఏ.