దిమాక్ ఖరాబ్ చేస్తున్న కరోనా: తగ్గి నెలలు గడుస్తున్నా.. ఏదీ గుర్తుండట్లేదు, చిరాకు జిందగీ!

Oxford Lancet Study Reveals Covid Harmful Brain effect For Years - Sakshi

లండన్‌: కరోనా వచ్చి పోయింది, మానసికంగా ఒడిదుడుకులకు గురైనా పర్వాలేదుగానీ ఓ గండం దాటేశాం అనుకుంటున్న వాళ్లకు.. కొత్త కొత్తగా వస్తున్న నివేదికలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. శ్వాస కోశ వ్యవస్థ.. అంతర్గత అవయవాల పని తీరును డ్యామేజ్‌ చేయడం వరకే వైరస్‌ ప్రభావం ఆగిపోలేదు. పోస్ట్‌ కొవిడ్‌ ఎఫెక్ట్‌.. మెదడుపైనా దీర్ఘకాలం ప్రభావం చూపెడుతోందని తాజా అధ్యయనాల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు వివిధ దేశాల నుంచి సుమారు పన్నెండున్నర లక్షల మంది పేషెంట్ల ఆరోగ్య నివేదికల ఆధారంగా.. లాన్సెట్‌ సైకియాట్రీ జర్నల్‌ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంత భారీ సంఖ్యలో ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడం ఇదే మొదటిది. వీళ్లలో శ్వాస కోశ, హృదయ, ఎముకల సంబంధిత సమస్యల కంటే.. మెదడు మీదే కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించారు.

COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రాణాలతో బయటపడినవారు నాడీ సంబంధిత, సైకియాట్రిక్‌ సమస్యల బారినపడుతున్న ప్రమాదం ఎక్కువగా ఉందని ఆధారాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి.

బ్రెయిన్‌ ఫాగ్‌.. ఇబ్బందికర పరిస్థితి. పనుల మీద దృష్టిసారించకపోవడం. విషయాల్ని గుర్తుంచుకోకపోవడం. చుట్టూ ఉన్న విషయాలను పట్టించుకోకపోవడం.. మీ మీద మీకే విరక్తి కలగడం. ఎపిలెప్సీ.. బ్రెయిన్‌ యాక్టివిటీ అబ్‌నార్మల్‌గా ఉండడం. అసాధారణ ప్రవర్తన. వీటితో పాటు మూర్ఛ సంబంధిత సమస్యలూ వెంటాడుతున్నాయి. డిప్రెషన్‌, యాంగ్జైటీ రూపంలో స్థిమితంగా ఉండనివ్వడం లేదు.

వైరస్‌ బారినపడి కోలుకున్నవాళ్లలో.. ఆరు నెలల నుంచి రెండేళ్లపాటు మానసిక రుగ్మతలు కొనసాగడం గుర్తించినట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పౌల్‌ హారిసన్‌ వెల్లడించారు. కొవిడ్‌-19 తర్వాతే ఎందుకిలా జరుగుతుంది?.. ఇది ఇంకెంత కాలం సాగుతుంది?.. సమస్యలను అధిగమించడం ఎలా? అనే వాటిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అంటున్నారు.

ఇదీ చదవండి: షియోమి వారి కుంగ్‌ ఫూ రోబో!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top