అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించబోదని.. దాడులు కొనసాగుతాయన్న రీతిలోనే ఆయన మాట్లాడారు. అయితే.. పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడడంలో క్రెడిట్ పూర్తిగా తమదేనని భావిస్తున్న పాకిస్తాన్‌కు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయంగా మారింది.
ఇరాన్‌పై భీకర దాడులు ఉంటాయన్న ట్రంప్.. డెడ్‌లైన్‌కు సరిగ్గా గంటన్నర ముందు శాంతి పావురం ఎగరేశారు. రెండు వారాలపాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈలోపు శాంతి చర్చలు జరుగుతాయని ప్రకటించారు. ఆ వెంటనే కాల్పుల విరమణ అనేది అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే.. కాసేపటికే షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో ప్రకటన చేశారు.
బుధవారం వేకువ జామున నెతన్యాహు కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇస్తున్నప్పటికీ లెబనాన్‌ను ఒప్పందంలో చేర్చలేదని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, అలాగే ప్రాంతీయ మిత్రదేశాలు ఇరాన్ అణు, క్షిపణి, ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కట్టుబడి ఉన్నాయని అన్నారు.
అమెరికా–ఇరాన్ యుద్ధ విరమణ ఒప్పందం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిందన్నది ట్రంప్ ప్రకటనతో స్పష్టమైంది. ఇరాన్, యుద్ధం ముగించడానికి 10-పాయింట్ల ప్రణాళికను అమెరికాకు అందజేసింది. అయితే.. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో ఇజ్రాయెల్–పాకిస్తాన్ మధ్య విభేదాలు స్పష్టమయ్యాయి. ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 10న శాంతి చర్చలు జరగనున్నాయి. ఆలోపు ఈ అంశం ఓ కొలిక్కి వస్తుందా? లేదంటే వ్యవహారం మరింత ముదురుతుందా? అనేది చూడాలి.
ఇదిలా ఉంటే.. మరోపక్క లెబనాన్ పరిస్థితి తీవ్రంగా ఉంది. మార్చి 2న హెజ్బుల్లా సంస్థ ఇజ్రాయెల్ నగరాలపై రాకెట్లు ప్రయోగించగా.. ప్రతిగా ఇజ్రాయెల్ భారీ స్థాయి దాడులు జరిపింది. ఈ దాడుల్లో 1,500 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
చైనా చెబితేనే..
పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో సంప్రదింపుల నేపథ్యంలోనే కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే.. కాసేపటికే సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో చైనా కీలక పాత్ర పోషించిందని అన్నారు. మరోవైపు.. ఇరాన్ వాదన కూడా అలాగే ఉంది. ఈ విషయంలో పాక్ ప్రమేయమేదీ లేదనట్లే ఇరాన్ ప్రకటించింది. కేవలం చైనా చెబితేనే తాము ఈ ఒప్పందానికి ముందుకు వచ్చామని అంటోంది.
ఇదీ చదవండి: అమెరికాకు ఇరాన్ 10 కండిషన్లు! ఇవిగో..


