
శాంతియుత ర్యాలీలు చేశామేగానీ హింసాత్మక ఘటనలకు దిగలేదన్న జెన్ జెడ్ యువత
రాజకీయ అవకాశవాదుల పనే ఇదంతా అని మండిపాటు
బంగ్లాదేశ్‌లో ఉద్యమ తరహాలో నిరసనను హైజాక్ చేస్తున్నారని ఆరోపణ
కాఠ్మండు: చేతికి ఆరో వేలుగా అతుక్కుపోయిన స్మార్ట్‌ఫోన్‌లో సోషల్‌మీడియా యాప్స్ అనేవి ఓ రకంగా ఆత్మ వంటివి. అలాంటి ఆత్మను చంపేస్తామంటూ ఊరుకోబోమని తెలియజేప్పేందుకే శాంతియుత నిరనస ర్యాలీలు చేపట్టామని నేపాల్‌లోని జెన్ జెడ్ యువత చెబుతోంది. దేశాన్ని చీడపీడలా తొలిచేస్తున్న అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవనాన్ని ప్రశ్నించేందుకు కదం తొక్కామని, మూడ్రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జెన్ జెడ్ విద్యార్థులు, యువజన సంఘాలు స్పష్టంచేశాయి. రాజకీయ అవకాశవాదులు ఉద్యమకారుల మాటున నిరసనకార్యక్రమాల్లో దూరిపోయి నేపాల్‌ను అగి్నగుండంలా మార్చేశారని విద్యార్థులు ఆరోపించారు.
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి చివరకు ప్రభుత్వాన్ని పడగొట్టాయని, నేపాల్‌లోనూ అదే కుట్ర జరుగుతోందని విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. లూటీలు, దోపిడీలకు తాము ఆమడదూరంలో ఉండిపోయామని, పోలీసులపై రాళ్లదాడి ఘటనలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ విధ్వంసం వెనుక బయటి శక్తుల హస్తముందని విద్యార్థులు ఆరోపించారు. ఏకపక్షంగా సామాజిక మాధ్యమాలపై ఆకస్మిక నిషేధం వల్ల కలిగే అనర్థాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలియజేప్పేందుకే వీధుల్లోకి వచ్చామని, విధ్వంసం చేయడం తమ ఉద్దేశ్యంకాదని స్పష్టంచేశారు.
మద్దతు పలికిన మాజీ ప్రధాని
విద్యార్థుల వాదనలకు పరోక్షంగా మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ మద్దతు పలికారు. ‘‘నాకు తెల్సిన విద్యార్థులు ఇలాంటి విధ్వంసాలకు అస్సలు దిగరు. వారసత్వ రాజకీయాలు, రాజకీయనేతలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవితం, అవినీతిపై విద్యార్థుల తిరుగుబాటు మొదలైంది. తీరాచూస్తే ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా మరో ‘తిరుగుబాటు’ఆరంభమైనట్లు తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. మేకవన్నె పులులు మీ ఉద్యమ మందల్లో దూరిపోయాయి. వారితో జాగ్రత్త అని మొదట్నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నా’’అని విద్యార్థులను భట్టారాయ్ హెచ్చరించారు.
ఉద్యమంలో బయటిశక్తులనుద్దేశిస్తూ.. ‘నేపాల్ ప్రజాస్వామ్య పునాదులనే పెకళించే దుస్సాహసానికి వాళ్లు దిగారు. వాళ్ల తదుపరి దారుణ లక్ష్యం ఏమిటో’’అని ఆందోళన వ్యక్తంచేశారు. సొంత దేశాన్ని తగలబెడుతున్న విద్యార్థులు అంటూ వస్తున్న వార్తలను భట్టారాయ్ తప్పుబట్టారు. ‘‘మొసలికన్నీరు కార్చడానికి విద్యార్థులేమీ రాజకీయనేతలు కాదు. అల్లర్లు, ఘర్షణలు చూసి విద్యార్థులే అవాక్కవుతున్నారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని బయటి శక్తులు దురుద్దేశ్యంతో ఉగ్రరూపంలోకి మార్చేశారని విద్యార్థులు బాధపడుతున్నారు. తాజా వినాశనానికి బయటిశక్తులే కారణం’’అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
తీవ్రంగా ఖండించిన యువజన, ఎన్‌జీవో సంఘాలు
హింసాత్మక ఘటనలను యువజన, విద్యార్థి, లాభాపేక్షలేని ప్రభుత్వేతర ఎన్‌జీవోలు ఖండించాయి. ముఖ్యంగా తొలుత శాంతియుత నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించిన జెన్ జెడ్ నేపాల్, హమీ నేపాల్ సంస్థలు ఈ విధ్వంసకాండపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశాయి. ‘‘మొదట్నుంచీ విధ్వంసాన్ని మేం అడ్డుకునేందుకే ప్రయతి్నంచాం. వినాశనానికి మాకు వీసమెత్తయినా సంబంధం లేదు. విద్యార్తులెవరూ ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసంచేయలేదు. ప్రధాని, మాజీ ప్రధానులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులతో మాకు ఎలాంటి సంబంధం లేదు’’అని బుధవారం ప్రకటనలో స్పష్టంచేశాయి. ‘‘ఘటనాస్థలికి మేం తర్వాత వచ్చాం. బాధితులను కాపాడాం. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం.
ప్రజల ఆస్తుల పరిరక్షణకు పాటుపడ్డాం’’అని జెన్‌జెడ్ నేపాల్ మరో ప్రకటనలో పేర్కొంది. ‘‘సహేతుకమైన, ప్రజాస్వామ్యయుత ఉద్యమపంథాలో సాగుతున్న మమ్మల్ని విధ్వంసకపర్వంలో భాగస్వాములుగా చిత్రించకండి. అధికారమే పరమావధిగా కుట్రలు చేసే రాజకీయ శక్తులు, అవకాశవాదులే ఈ వినాశనానికి సృష్టికర్తలు. మా ఉద్యమానికి తప్పుడు మరకలు అంటించే కుట్రలు జరుగుతున్నాయి. మంచి కోసం పోరాడుతున్న మమ్మల్ని దేశవినాశకారులుగా చిత్రించే కుట్రలు జరుగుతున్నాయి’’అని జెన్‌జెడ్ ఆరోపించింది. ‘‘మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదు. కూల్చడం మా పనికాదు. దేశ పునర్‌నిర్మాణమే మా ధ్యేయం. దేశవ్యతిరేక యుద్ధం మేం చేయట్లేము. చెడుకు వ్యతిరేకంగా సాగుతున్న సంఘర్షణలో మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటున్నాం. నఖూ జైలును మేం బద్దలుకొట్టలేదు. మాజీ ఉప ప్రధానమంత్రి రవి లమీచ్ఛానేను మేం జైలు నుంచి విడిపించలేదు ’’అని హమీ నేపాల్ ఒక ప్రకటనలో పేర్కొంది.