నాసా మూన్‌ మిషన్‌లో భారత సంతతి వ్యక్తి

NASA Selects Astronaut Raja Chari For Manned Mission To Moon - Sakshi

వాషింగ్టన్‌: భార‌త సంత‌తికి చెందిన క‌ల్న‌ల్ రాజా చారి అరుదైన ఘ‌న‌త‌ సాధించారు. చంద్రుడి మీద‌కు వ్యోమ‌గాముల‌ను పంపాల‌నుకుంటున్న నాసా మూన్‌ మిష‌న్‌ ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌’కు అత‌ను ఎంపికయ్యారు. అమెరికా వైమానిక ద‌ళంలో రాజా జాన్ వురుపుత్తూర్ చారి క‌ల్న‌ల్‌గా ప‌నిచేస్తున్నారు. ఇక ఈ మిష‌న్ కోసం నాసా మొత్తం 18 మందిని ఎంపిక చేయగా.. వీరిలో 9మంది మహిళలే ఉండటం గమనార్హం. బుధవారం నాసా మూన్‌ మిషన్‌కు ఎంపికైన పద్దేనిమిది మంది పేర్లు వెల్లడించింది. 2024లో చంద్రుడి మీదకి మనుషులను పంపాలని నాసా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాజా చారికి రెండు వేల గంట‌ల పాటు విమానం నడిపిన అనుభ‌వం ఉంద‌ని నాసా ఏరోనాటిక్స్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. 

మ‌సాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎంఐటీ) ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీలో రాజా చారి శిక్ష‌ణ పొందారు. యూఎస్ నావల్‌ టెస్ట్ పైల‌ట్ స్కూల్‌లో శిక్ష‌ణ పొందిన ఏకైక భార‌త సంతతి వ్య‌క్తి  కూడా ఈయ‌నే కావ‌డం విశేషం. ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాసుల కోసం నాసా అత‌న్ని 2017లో ఎంపిక చేసింది. తొలుత అవ‌స‌ర‌మైన ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ శిక్ష‌ణ కాలాన్ని అత‌ను పూర్తి చేశాడ‌ని, ఇప్పుడు రాజాచారి మూన్‌ మిష‌న్‌కు అర్హ‌త సాధించిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌’కు ఎంపికైన వ్యోమ‌గాముల పేర్ల‌ను ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ ఫ్లోరిడాలోని కెన్న‌డీ స్పేస్ సెంట‌ర్‌లో ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా కెన్నడీ ‘నా తోటి అమెరికన్‌లారా, మనల్ని చంద్రుడి మీదకు.. అంతకు మించి తీసుకువెళ్ళే భవిష్యత్ హీరోలను నేను మీకు పరిచయం చేస్తున్నాను’ అన్నారు. (చదవండి: జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం)

‘ఆర్టెమిస్’ బృందంలోని వ్యోమగాములు విభిన్న నేపథ్యాలు, నైపుణ్యం, అనుభవం నుంచి వచ్చారు. ఈ బృందంలోని చాలా మంది వ్యోమగాములు 30-40 ఏళ్ల లోపు ఉన్నవారే కావడం విశేషం. వీరిలో అతి పెద్ద వ్యక్తి వయసు 55 ఏళ్లు ఉండగా.. పిన్న వయసు వ్యక్తికి 32 ఏళ్లు ఉన్నాయి.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top