చైనా తీరుపై మండిపడ్డ నాసా..!

NASA Denounces China Over Long March 5B Debris - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన చైనా రాకెట్‌ భారీ శకలం ఆదివారం తెల్లవారుజామున మాల్దీవుల సమీపంలో హిందూ మహాసముద్రంలో కూలిన విషయం తెలిసిందే. రాకెటు శకలాలు సముద్రంలో కూలడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాగా చైనా తీరుపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తీవ్రంగా మండిపడింది. చైనా అంత‌రిక్ష శకలాల విష‌యంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిందని అంతేకాకుండా అంతరిక్ష ప్రయోగ ప్రమాణాలను పాటించడంలో చైనా ఘోరంగా విఫలమైందని పేర్కొంది. చైనా అతిపెద్ద రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ నియంత్రణ కోల్పోయి స‌ముద్రంలో కూలిపోయిన కొద్దిసేపటికే నాసా స్పందించింది.

చైనా స్పేస్ ప్రోగ్రామ్‌పై నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ మాట్లాడుతూ.. అంతరిక్ష ప్రయోగాలపై చైనా అనుసరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.అంతరిక్ష ప్రయోగాలను చేసే దేశాలు కచ్చితంగా స్పేస్‌ డెబ్రిస్‌(శకలాలు)పై బాధ్యతవహించాలని తెలిపారు.  రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన శకలాలు నియంత్రణ కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు,  భూమిపై ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. చైనా ప్రయోగించే అంతరిక్ష ప్రయోగాలపై పారదర్శకత ఉండేలా చూసుకొవాలని సూచించారు.

అంతరిక్షంలో పాగా వేసేందుకు చైనా సొంత స్పేస్‌స్టేషన్‌ కోసం ఏప్రిల్‌ 29 రోజున లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెటును ఉపయోగించి టియాన్హే మ్యాడుల్‌ను అంతరిక్షంలోకి పంపింది. మ్యాడుల్‌కు చెందిన భారీ శకలం  తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని వచ్చింది.

చదవండి: అంతరిక్షంపై డ్రాగన్‌ నజర్‌...!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top