జలసమాధి చేస్తాం  | Mojtaba Khamenei signals new chapter for Iran control of Hormuz | Sakshi
Sakshi News home page

జలసమాధి చేస్తాం 

May 1 2026 1:50 AM | Updated on May 1 2026 1:50 AM

Mojtaba Khamenei signals new chapter for Iran control of Hormuz

ఇరాన్‌ శత్రువులు ఉండాల్సిన చోటు అదే..  

అమెరికాకు ఇరాన్‌ సుప్రీంలీడర్‌ మొజ్తబా ఖమేనీ హెచ్చరిక  

గల్ఫ్‌ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ప్రకటన  

టెహ్రాన్‌: శత్రువుల భారీ నుంచి గల్ఫ్‌ను కాపాడుతామని, ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్‌ సుప్రీంలీడర్‌ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్‌ గల్ఫ్‌లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామని పరోక్షంగా స్పష్టం చేశారు. 

ఈ మేరకు ఖమేనీ విడుదల చేసిన లిఖిత సందేశాన్ని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ చానల్‌లో గురువారం చదివి వినిపించారు. హార్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్‌ డిమాండ్‌ చేయగా, అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్‌తోపాటు హార్మూజ్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. 

హార్మూజ్‌లో ‘నూతన నిర్వహణ’అన్ని గల్ఫ్‌ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని వెల్లడించారు. తద్వారా పొరుగు దేశాలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. పర్షియన్‌ గల్ఫ్‌లో అభద్రతకు అమెరికా ఇక్కడ తిష్టవేయడమే ముఖ్య కారణమని ఖమేనీ ఆక్షేపించారు. గల్ఫ్‌లో సొంత స్థావరాలను కాపాడుకొనే సామర్థ్యం అమెరికాకు లేదన్నారు. అలాంటప్పుడు ఈ ప్రాంతంలోని ఆశ్రితులకు భద్రత కల్పిస్తుందన్న ఆశ అసలే లేదని ఉద్ఘాటించారు. 

వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అక్కడ దురాశ, దురుద్దేశంతో ప్రవర్తించే ఇరాన్‌ శత్రువులకు నీటి అడుగున తప్ప మరెక్కడా స్థానం లేదని హెచ్చరించారు. సముద్ర గర్భంలో శత్రువును దెబ్బకొట్టడానికి రహస్య అస్త్రం సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్‌ సైన్యం ప్రకటించిన తర్వాత మొజ్తబా ఖమేనీ అమెరికాకు ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అమెరికా ప్రమేయం లేకపోతేనే గల్ఫ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన వెల్లడించారు. అమెరికాతో స్నేహం వదులుకోవాలని గల్ఫ్‌ దేశాలకు పరోక్షంగా సూచించారు.  

భయంకర భూతం అమెరికా  
ఇరాన్‌ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తిగా పరిరక్షించుకుంటామని మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబించక తప్పదని తెలిపారు. దేశంలోనూ, వెలుపల ఉన్న 9 కోట్ల మంది ఇరానీయన్లు నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు, క్షిపణి సామర్థ్యాల వరకు తమ ఆధ్యాతి్మక, మానవ, శాస్త్రీయ, పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలన్నింటినీ జాతీయ సంపదలుగా భావిస్తారని స్పష్టంచేశారు. 

వారు దేశ జలాలను, భూమిని, గగనతలాన్ని ఎలాగైతే కాపాడుకుంటారో.. అలాగే వీటిని కూడా భద్రంగా కాపాడుకుంటారని పేర్కొన్నారు. అమెరికాను ‘గ్రేట్‌ సాతాను’గా ఖమేనీ అభివరి్ణంచారు. అదొక భయంకర భూతమని నిందించారు. పర్షియన్‌ గల్ఫ్‌లో అమెరికన్లకు ఏం పని అంటూ ప్రశ్నించారు. వారు ఇక్కడి వ్యవహారాలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. హార్మూజ్‌ జలసంధిపై తమ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. హార్మూజ్‌పై ఇరాన్‌ నియంత్రణ ఉంటేనే గల్ఫ్‌ దేశాలు సురక్షితంగా 
ఉంటాయని స్పష్టంచేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement