బ్యాంకాక్: మిస్ యూనివర్స్ 2025 విజేతగా మిస్ మెక్సికో ఫాతిమా బాష్(25) కిరీటం దక్కించుకుంది. మాజీ సుందరి విక్టోరియా క్జేర్ థైల్విగ్(డెన్మార్క్) భావోద్వేగ క్షణాల మధ్య ఫాతిమాకు కిరీటం తొడిగారు. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్ నిలిచారు.
థాయ్‌లాండ్‌లోని నోంతబురి నగరంలో అంగరంగవైభవంగా ఈ గ్రాండ్ ఫినాలే జరిగింది. స్టీవ్ బైర్న్ హోస్ట్‌గా వ్యవహరించగా.. థాయ్ గాయకుడు జెఫ్ సాచుర్ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. వందకి పైగా దేశాల(120) పోటీదారుల్ని ఓడించి.. 74వ విశ్వ సుందరి సుందరి టైటిల్‌ను ఫాతిమా బాష్(Fatima Bosch) గెలుచుకున్నారు. ‘‘మహిళలు ప్రపంచవ్యాప్తంగా తమ గొంతు వినిపించి.. మార్పు తీసుకురావాలి’’అని న్యాయనిర్ణేతల ఆఖరి ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.
టాప్ 5లో వెనిజులా, ఫిలిప్పీన్స్, కోట్ డి ఐవోర్ (Côte d’Ivoire) అందాల భామలు నిలిచారు. భారత్‌కు చెందిన మనికా విశ్వకర్మ (India).. టాప్ 12 వరకు చేరి స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత ఎలిమినేట్ అయ్యారు.
ఫాతిమా బాష్ ఫెర్నాండేజ్ (Fátima Bosch Fernández) మెక్సికోలోని టబాస్కో రాష్ట్రం టియాపాలో 19 మే 2000లో జన్మించారు. ఫ్యాషన్ డిజైన్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఎత్తు 5.5 అడుగులు. పెయింటింగ్, టెన్నిస్ ఆడటం, గుర్రపు స్వారీ వంటి ఆసక్తులు ఉన్నాయి. కళాత్మక ఆసక్తులు, క్రీడా నైపుణ్యాలు, సామాజిక సందేశం అందాల పోటీల్లో ఆమె విజయానికి పునాది అయ్యాయి.


