అశ్లీల నృత్యం.. అందాల కిరీటం వెనక్కి

Miss Papua New Guinea 2019 Winner Loses Her Crown After Posting Twerking Video on TikTok - Sakshi

మిస్ పాపువా న్యూ గినియాకు షాకిచ్చిన కమిటీ

పోర్టు మోర్స్‌బే: దేశంలో కానీ, సమాజంలో కానీ ఏదైనా విశిష్ట పురస్కారం, అవార్డు వంటివి పొందిన వ్యక్తులు తమ ప్రవర్తన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదు నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను అంటే ఈ అందాల సుందరికి పట్టిన గతే పడుతుంది. అందాల పోటీలో కిరీటం సాధించిన ఓ మహిళ అశ్లీల నృత్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. దాంతో నెటిజనులు సదరు మహిళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసలు నీలాంటి దానికి ఇంతటి గౌరవం ఎలా లభించింది’’ అంటూ విమర్శించారు. ‘‘ఆ కిరీటం ధరించడానికి నీవు అనర్హురాలివి’’ అని ట్రోల్‌ చేశారు. ఈ దుమారం కాస్త పెద్దది కావడంతో షో నిర్వహకులు ఆమె వద్ద నుంచి కిరీటం వెనక్కి తీసుకున్నారు. 

ఆ వివరాలు.. లూసి మైనో అనే మహిళ(25) 2019లో మిస్‌ పాపువా న్యూగినియాగా ఎన్నికైంది. ఈ క్రమంలో ఆమె కొద్ది రోజుల క్రితం తన టిక్‌టాక్ అకౌంట్‌లో ఓ డ్యాన్స్‌ వీడియోని షేర్‌ చేసింది. చాలా అశ్లీలంగా ఉన్న ఈ వీడియో పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. దాంతో మిస్‌ పసిఫిక్‌ ఐస్‌ల్యాండ్స్‌ పీజంట్‌ పీఎన్‌జీ కమిటీ లూసి మైనోకు ప్రదానం చేసిన కిరీటాన్ని వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘‘మా ప్రధాన ఉద్దేశం మహిళా సాధికారిత. మా వేదికది చాలా ప్రత్యేకమైన శైలి. సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ విలువలు ద్వారా మా దేశం, ఇక్కడి ప్రజల గురించి మిగతా లోకానికి తెలియజేస్తాం. ఇక మేం నిర్వహించే అందాల పోటీల ద్వారా స్వీయ విలువ, సమగ్రత, సామాజిక సేవ, విద్య వంటి అంశాలను ప్రచారం చేస్తాం’’ అని తెలిపారు.

‘‘ఇంత విలువైన అవార్డు సొంతం చేసుకున్న లూసి మైనో ఇలాంటి అశ్లీల డ్యాన్స్‌ వీడియోని షేర్‌ చేయడం మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. రోల్‌మోడల్‌గా నిలవాల్సిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదు. అందుకే ఆమెకు ప్రధానం చేసిన కిరీటాన్ని వెనక్కి తీసుకున్నాం’’ అని తెలిపారు. ఇదే పని ఓ మగాడు చేస్తే మేం నవ్వుకునే వాళ్లం. కానీ లూసీ మైనో ఇలా చేయడం మమ్మల్ని నిరాశకు గురి చేసింది అన్నారు. 

చదవండి: షాకింగ్‌: అందాల పోటీ విజేతకు వేదిక మీదే ఘోర అవమానం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top