నేనెప్పుడు దోశ వేయలేదు: కమలా హారిస్‌

Kamala Harris Once Said Never Made Dosa Old Video Resurfaces Now - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బిడెన్‌ భారత సంతతి సెనెటర్‌ కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష రేసులో నిలిపిన నాటి నుంచి ఆమెకు సంబంధించిన విషయాల గురించి సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అగ్రరాజ్యంలో ఒక నల్లజాతీయురాలికి దక్కిన ఆ అవకాశం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఇండో- అమెరికన్లు, శ్వేతజాతీయేతరులు, దక్షిణాసియా దేశాల ప్రజలు, డెమొక్రటిక్‌ పార్టీ మద్దతుదారులు కమలా హారిస్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు కమలా హారిస్‌ భారత మూలాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. 

ఈ క్రమంలో భారత సంతతికి చెందిన అమెరికన్‌ నటి, టీవీ పర్సనాలిటీ మిండీ కాలింగ్‌.. కమలకు అవకాశం ఇచ్చిన జో బిడెన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఉపాధ్యక్షురాలిగా తనను గెలిపించాలంటూ తోటి సోదరీమణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌, మిండీ కాలింగ్‌ కలిసి భారతీయ(దక్షిణాది) వంటకం దోశ వేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లాస్‌ ఏంజెల్స్‌లోని కాలింగ్‌ నివాసంలో తమ తమిళ మూలాల గురించి ప్రస్తావిస్తూ ఇద్దరూ వంట చేసిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో దోశ పిండి కలుపుతుండగా తను ఇంతకు ముందెన్నడూ దోశ వేయలేదని కమలా హారిస్‌ చెప్పుకొచ్చారు. ఇక తమిళ స్పెషల్‌ వంటకం ఇడ్లీసాంబార్‌ అంటే తనకెంతో ఇష్టమని ఆమె ఇది వరకే పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా కమలా హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వారు కాగా.. తండ్రి జమైకా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top