ట్రంప్‌ అధ్యక్ష పదవికి తగడు

Kamala Harris attack on Donald trump - Sakshi

ఆయనపై కేసు వేస్తాం

తొలి ఎన్నికల ప్రసంగంలోనే నిప్పులు చెరిగిన కమలా హ్యారిస్‌

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్‌ అభ్యర్థిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ తన తొలి ఎన్నికల ప్రసంగంలోనే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధ్యక్ష పదవికి ఆయన తగిన వ్యక్తి కాదని విమర్శించారు. ట్రంప్‌లో నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో అమెరికా వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌తో కలిసి కమల బుధవారం విల్లింగ్టన్‌లో తొలి ఎన్నికల ప్రసంగం చేశారు.

కరోనా వైరస్‌ కారణంగా ఈ సమావేశాన్ని ప్రజల మధ్య నిర్వహించలేదు. బైడెన్, హ్యారిస్‌లు ఇద్దరూ మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ విలేకరులతో మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ పాలనా యంత్రాంగం గందరగోళం సృష్టిస్తోందని అధ్యక్షుడు ట్రంప్‌పైనా, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మీద కచ్చితంగా కేసు వేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రజల సంక్షేమానికి కొత్త చట్టాలు తెస్తామని, వాతావరణ మార్పులపై పోరాడతామని బైడెన్, హ్యారిస్‌లు కలసికట్టుగా హామీ ఇచ్చారు.

ఒకే రోజులో 2.6 కోట్ల డాలర్ల సేకరణ
ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే డెమోక్రాట్లలో ఎన్నికల జోరు పెరిగింది. కేవలం 24 గంటల్లోనే జో బైడెన్‌ 2.6 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల్ని సేకరించారు. ఒక్క రోజులో ఈ స్థాయిలో నిధులు రావడం ఇప్పటివరకు రికార్డు. డెమోక్రాట్‌ మద్దతు దారుల నుంచి భారీగా విరాళాలు రావడం ఉత్సాహాన్ని నింపుతోందని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

మా అమ్మే స్ఫూర్తి
కమలా హ్యారిస్‌ తన తొలి ఎన్నికల ప్రసంగంలో తల్లి శ్యామలా గోపాలన్‌ మాటల్ని మళ్లీ తలచుకున్నారు. తన జీవితంలో ఆమె పాత్ర చాలా గొప్పదని అన్నారు. జమైకా దేశస్తుడైన తండ్రి డొనాల్డ్, భారతీయురాలైన తల్లి శ్యామల ప్రపంచంలోని భిన్న వాతావరణం నుంచి వచ్చారని చెప్పారు. కూర్చొని ఫిర్యాదులు చేయకుండా ఏదో ఒక పని చేయమని చెప్పిన తల్లి మాటలు ఇప్పటికీ  స్ఫూర్తినిస్తాయన్నారు. ఆమె వల్లనే అమెరికాలో సమాన న్యాయం సాధించడం కోసం లాయర్‌గా 30 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్నానన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top