పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వైపు ఇరాన్ నాలుగు వన్‌వే అటాక్ డ్రోన్లు ప్రయోగించబడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది. తక్షణ ముప్పుగా ప్రకటించుకుని తమ దళాలు వాటిని గగనతలంలోనే కూల్చివేశాయని తెలిపింది. అనంతరం మరిన్ని దాడులను అడ్డుకునేందుకు ఇరాన్‌లోని గోరుక్ ప్రాంతం, ఖేశ్మ్ ద్వీపంలోని తీర నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది.
ఈ ఘటనలతో హర్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే చమురు, సహజ వాయువు ఎగుమతుల్లో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా సాగుతుంది. ఇక్కడ ఎలాంటి సైనిక ఘర్షణ జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇప్పటికే ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా పలు చర్యలు చేపడుతోంది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న ఓ చమురు ట్యాంకర్‌ను హిందూ మహాసముద్రంలో అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్ ఇంధన రంగంపై కొత్త ఆంక్షలను కూడా ప్రకటించింది.
మరోవైపు ఇరాన్ మీడియా మాత్రం హర్ముజ్ సమీప జలాల్లో తమ బలగాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. అమెరికా నౌకాదళ కదలికలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నప్పటికీ.. తాజా పరిణామాలు మాత్రం భిన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవలే కాల్పుల విరమణ పొడిగింపుపై చర్చలు జరిగినప్పటికీ, తాజా దాడులు ఆ ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా మారాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణలు కూడా మళ్లీ ఉద్ధృతమవుతుండటంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం అస్థిరత వైపు అడుగులు వేస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ, ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


