అమెరికా, ఇరాన్ మధ్య కుదరని ఒప్పందం
ఇస్లామాబాద్: ప్రపంచమంతా అత్యంత ఆశతో ఎదురు చూసిన అమెరికా, ఇరాన్ చర్చలు చివరికి విఫలమయ్యాయి. పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి ముగింపు పలికి శాంతి, సుస్థిరతకు బాటలు వేస్తాయని, శాశ్వత కాల్పుల విరమణకు బాటలు పరుస్తాయని, ఆ మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదురుతుందని ప్రపంచ దేశాలు పెట్టుకున్న ఆశలు వమ్మే అయ్యాయి.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ సారథ్యంలోని ఇరాన్ బృందం మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చలు ఎటూ తేలకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. ఏకధాటిగా 21 గంటలపాటు కొనసాగిన చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఎవరి డిమాండ్లపై వారు మొండిపట్టు పట్టడంతో ఎలాంటి ఒప్పందమూ సాధ్యపడలేదు.
దాంతో ఇరు బృందాలూ ఆదివారమే తమ తమ దేశాలకు వెనుదిరిగాయి. అమెరికా వెళ్లేముందు వాన్స్ ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలమయ్యాయని స్వయంగా ప్రకటించారు. ‘‘అణు కార్యక్రమాలకు స్వస్తి పలకబోనని ఇరాన్ మొండికేసింది. హార్మూజ్‌పైనా అదే వైఖరి! చర్చల వైఫల్యానికి ఇవి రెండే ప్రధాన కారణాలు. ఇరాన్‌తో 21 గంటలపాటు చర్చలు జరిపాం. కొన్ని అంశాలపై లోతుగా మాట్లాడాం. చర్చలకు సంబంధించి ఇదొక్కటే మంచివార్త. కానీ ఉమ్మడి నిర్ణయానికి మాత్రం రాలేకపోయాం.
ఇది అమెరికాకంటే ఇరాన్‌కే అతి పెద్ద దుర్వార్త. అణ్వాయుధం తయారు చేయబోమని ఒక్క నిర్దిష్టమైన, స్పష్టమైన హామీని మాత్రమే కోరాం. అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నది కూడా ఇదే. చర్చల ద్వారా మేం ఇదే సాధించాలనుకున్నాం. చర్చలకు మేం ముందుకు రావడానికి అసలు కారణమూ ఇదే. కానీ మా షరతులకు ఇరాన్ ఒప్పుకోలేదు. చర్చల సందర్భంగా ట్రంప్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆయన వైఖరిని ఇరాన్ బృందానికి ఎప్పటికçప్పుడు తెలియజేస్తూ వచ్చాం’’ అని వాన్స్ చెప్పారు. తమ ప్రతిపాదనలను ఇరాన్ ఇకనైనా ఆమోదిస్తుందో లేదో చూడాలన్నారు. అణ్వస్త్ర తయారీ, హార్మూజ్ జలసంధి ద్వారా సాధారణ రాకపోకలు, విదేశాల్లో దిగ్భందంలో ఉన్న ఇరాన్ స్థిరచరాస్తులను విడిపించడం వంటి ప్రధానాంశాల్లో సయోధ్య వీలవకపోవడమే చర్చల వైఫల్యానికి కారణమని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది.
అసాధ్యమైన డిమాండ్లు: బఘేర్
చర్చల వైఫల్యంపై ఇరాన్ బృంద సారథి, స్పీకర్ ఘాలిబఫ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ఇరాన్ సర్వతోముఖాభివృద్ధికి కోసం దూరదృష్టితో మేం చేసిన పలు ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించలేదు. మా బృంద విశ్వాసాన్ని సంపాదించడంలో విఫలమైంది. దాని ఆధిపత్య తరహా దౌత్యమే ఇందుకు కారణం. మాపై సైనిక చర్య నేపథ్యంలో దేశ రక్షణ కోసం 40 రోజులుగా చేస్తున్న పోరాటంలో రాజీ ఉండబోదని కరాఖండిగా చెప్పేశాం. చర్చల సాఫల్యం అవతలి పక్షం అనుకూల వైఖరి, అంకితభావం మీదనే ఆధారపడి ఉంటుంది. అమెరికా మా ముందు ఆచరణ సాధ్యం కాని, అతి, అక్రమ డిమాండ్లు పెట్టింది. ఇలాంటి చర్యలతో చర్చలు ముందుకు సాగబోవు. పరస్పర అవిశ్వాసం, సంశయాల నడుమ సఫలత అసాధ్యం’’ అన్నారు. ‘‘ఒకే దఫాలో ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టం.
పలుమార్లు చర్చల తర్వాత బహుశా ఇరు పక్షాల వైఖరిలో కాస్త సారూప్యత సాధ్యపడొచ్చు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయెల్ బఖాయీ అభిప్రాయపడ్డారు. మలి దఫా చర్చలపై యోచిస్తున్నట్టు అతిథ్య పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ప్రకటించారు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌తో అమెరికా జరిపిన తొలి ప్రత్యక్ష చర్చలు ఇవే కావడం తెలిసిందే. ఇస్లామాబాద్‌లో శనివారం మొదలైన ఈ చర్చల్లో అమెరికా తరఫున వాన్స్‌తో పాటు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అధ్యక్షుని దూత స్టీవ్ విట్కాఫ్; ఇరాన్ తరఫున బఘేర్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ; మధ్యవర్తిత్వ దేశ హోదాలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చల్లో పాల్గొన్నారు. పశ్చిమాసియా నుంచి అమెరికా సేనల నిష్క్రమణ, హార్మూజ్‌పై పట్టు వంటి 10 కీలక డిమాండ్లతో ఇరాన్; అణ్వస్త్ర తయారీకి తక్షణం అడ్డుకట్టే ప్రధాన డిమాండ్‌గా వాన్స్ బృందం పాక్‌లో
కాలుమోపాయి.
లెబనాన్‌పై ఆగని దాడులు
బీరూట్: లెబనాన్‌తో మంగళవారం చర్చలు జరపనున్నా, ఆ దేశంపై దాడులను మాత్రం ఇజ్రాయెల్ ఆపడం లేదు! ఆదివారం దక్షిణ లెబనాన్‌లోని మారౌబ్ గ్రామంపై దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌పై దాడులను పోప్ లియో–14 తీవ్రంగా ఖండించారు. మరోవైపు 40రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్‌లో 3,375 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఫోరెన్సిక్ మెడిసన్ ఆర్గనైజేషన్ ఆదివారం ప్రకటించింది. మృతుల్లో 500 మంది దాకా మహిళలున్నారు. ఇప్పటిదాకా యుద్ధంలో లెబనాన్‌లో 2,055 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది, గల్ఫ్‌దేశాల్లో డజను మందికిపైగా చనిపోయారు.


