గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక | Iran Supreme Leader Warn Gulf Nations Wont Be Safe For US Military Bases, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

May 27 2026 10:44 AM | Updated on May 27 2026 1:25 PM

Iran Supreme Leader Warn Gulf nations wont be safe for US military bases

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మెజ్తబా ఖమేనీ.. ఇజ్రాయెల్‌, అమెరికా, గల్ఫ్‌ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఇకపై సురక్షితంగా ఉండవు. ఇజ్రాయెల్‌ను ఖచ్చితంగా కూకటివేళ్లతో పెకిలించాలి.. అది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, వాషింగ్టన్ రోజురోజుకూ తన పూర్వ వైభవానికి దూరమవుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ తాజాగా తన టెలిగ్రామ్‌ ఛానెల్‌లో సందేశం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఖమేనీ..‘పశ్చిమాసియా ప్రాంతంలో తన దుశ్చర్యలకు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇకపై అమెరికాకు సురక్షితమైన ఆశ్రయం ఉండదు. కాలం వెనక్కి తిరగదు. ఈ ప్రాంతంలోని దేశాలు, భూములు ఇకపై అమెరికా స్థావరాలకు రక్షణ కవచాలుగా పనిచేయవు. అమెరికా తన పూర్వ వైభవానికి దూరమవుతోంది.

ఇదే సమయంలో అమెరికా దళాలు దక్షిణ ఇరాన్‌లో దాడులు జరిపాయి. దక్షిణ ఇరాన్‌లో అమెరికా తాజాగా జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలేనని టెహ్రాన్ పేర్కొంది. అమెరికా ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తోందని ఇరాన్‌ ఆరోపించింది. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ప్రతీకారానికి గురయ్యే అవకాశం ఉందని ఇరాన్‌ సంకేతం ఇచ్చింది. కాగా, బహ్రెయిన్​, కువైట్​, ఇరాక్​, యూఏఈ, ఖతార్​ లాంటి దేశాలతో కలిపి ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన చిన్న, పెద్ద మిలటరీ క్యాంపులు 19 వరకు ఉన్నాయి.


మరోవైపు, ఖమేనీ.. హజ్ యాత్రకు వచ్చిన వారంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు. పాలస్తీనా, అల్​-అక్సా మసీదుకు విముక్తి కలగాలని, ముస్లింల కష్టాలు తీరాలని, ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తులపై విజయం సాధించాలని అందరూ ప్రార్థన చేయండి అని వ్యాఖ్యానించారు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్​ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నింటికీ ఒకే రకమైన బలం, ప్రయోజనాలు ఉన్నాయని, అవే భవిష్యత్తులో ప్రపంచంలో ఒక కొత్త మార్పును తెస్తాయని తెలిపారు.

ఇరాన్ సైనిక సామర్థ్యాలు

  • బాలిస్టిక్ క్షిపణులు: ఇరాన్ వద్ద 2,000 కి.మీ. వరకు దాడి చేయగల క్షిపణులు ఉన్నాయి. ఇవి గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను చేరగలవు.

  • డ్రోన్లు: ఇరాన్ డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఇవి గల్ఫ్‌లోని ఆయిల్ ఫీల్డ్స్, నౌకలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు.

  • నౌకాదళం:  స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌లో ఇరాన్ చిన్న నౌకలు, మైన్స్, టార్పెడోలు ఉపయోగించి అమెరికా నౌకాదళాన్ని ఇబ్బంది పెట్టగలదు.

  • ప్రాక్సీ గ్రూపులు: హిజ్‌బుల్లా, హౌతీలు వంటి మిత్ర గ్రూపుల ద్వారా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో పరోక్ష దాడులు చేయగలదు.


గల్ఫ్‌లో అమెరికా స్థావరాలు

  • ఖతార్: అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్ – అమెరికా యొక్క అతిపెద్ద ఎయిర్ బేస్, 10,000 పైగా సైనికులు.

  • బహ్రెయిన్: నేవల్ సపోర్ట్ యాక్టివిటీ – అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కేంద్రం.

  • సౌదీ అరేబియా: ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ – మధ్యప్రాచ్యంలో కీలకమైన ఎయిర్ ఆపరేషన్ల కేంద్రం.

  • యుఏఈ: అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ – అమెరికా F-35, డ్రోన్ ఆపరేషన్లకు ప్రధాన కేంద్రం.


ఇరాన్‌ హెచ్చరికల ప్రభావం..

ప్రాంతీయ స్థిరత్వం: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణా తీవ్రంగా దెబ్బతింటుంది.

అమెరికా వ్యూహం: అమెరికా తన స్థావరాల భద్రతను పునఃపరిశీలించాల్సి వస్తుంది.

గల్ఫ్ దేశాలు: అమెరికా రక్షణపై ఆధారపడుతున్న ఈ దేశాలు, ఇరాన్ దాడుల భయంతో కొత్త దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచ మార్కెట్లు: భారత్‌, యూరప్, ఆసియా దేశాలు గల్ఫ్ చమురుపై ఆధారపడుతున్నందున, ఏవైనా అంతరాయాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement