పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. లెబనాన్ అంశంపై తేల్చేంత వరకు తాము చర్చలకు వెళ్లబోమని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా ఫార్స్ న్యూస్ అధికారికంగా ధృవీకరించింది.
రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించిన ఇరు దేశాలు.. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పాకిస్తాన్ ఏర్పాట్లు కూడా చేసింది. ఉభయ పక్షాలను వేర్వేరు చోట్ల కూర్చోబెట్టి చర్చలు జరపాలని భావించింది.
అయితే.. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించబోదని చెబుతూ ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులను ఖండిస్తున్న ఇరాన్.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము చర్చలకు ముందుకు వస్తామని మెలిక పెట్టింది.


