ఇరాన్‌ గగనతలం మూసివేత.. ఏం జరగనుంది? | Iran shut down its airspace and Trump canceled all plans | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ గగనతలం మూసివేత.. ఏం జరగనుంది?

May 23 2026 11:32 AM | Updated on May 23 2026 11:50 AM

Iran shut down its airspace and Trump canceled all plans

టెహ్రాన్‌: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర దశకు చేరుకున్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగుతూనే మరోసారి సైనిక దాడులకు అమెరికా రెడీ అవుతున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై తాజా దాడుల అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఏ క్షణంలోనైనా మెరుపు దాడులు జరిగే అవకాశముంది.

ఈ నేపథ్యంలో ఇరాన్‌ అప్రమత్తమైంది. టెహ్రాన్‌పై అమెరికా మరోసారి దాడులకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. భద్రతా కారణాలతో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం, ఇరాన్‌పై సంభావ్య దాడుల నేపథ్యంలో అమెరికా సైన్యం, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన పలువురు అధికారులు తమ మెమోరియల్ డే వీకెండ్ సెలవులను రద్దు చేసుకున్నారు. మొదట న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్‌లో వీకెండ్ గడపాలని భావించిన ట్రంప్ కూడా తన ప్రణాళిక మార్చుకుని వైట్ హౌస్‌కు తిరిగి వెళ్లినట్లు సమాచారం. చర్చలు చివరి నిమిషంలో ఫలించకపోతే ఇరాన్‌పై కొత్త దాడులకు ట్రంప్ సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. "ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ వాళ్లు అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని మేము ఎప్పటికీ అనుమతించం. అందుకే మేము కఠిన చర్యలు తీసుకున్నాం" అని ట్రంప్ అన్నారు.

ఇదే సమయంలో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ప్రస్తుతం టెహ్రాన్‌లో ఉన్నారు. శనివారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ జనరల్ అహ్మద్ వాహిదీతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఖతార్ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యమవుతున్నారు. అయితే చర్చలు చాలా క్లిష్టంగా సాగుతున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ డ్రాఫ్ట్‌లు మారుతున్నా పెద్దగా పురోగతి కనిపించడం లేదని పేర్కొంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement