ట్రంప్‌పై మీమ్‌ల వర్షం  | Iran has been trolling US President Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌పై మీమ్‌ల వర్షం 

Apr 7 2026 4:53 AM | Updated on Apr 7 2026 4:53 AM

Iran has been trolling US President Donald Trump

వెటకారపు కొటేషన్లతో ఓ ఆటాడుకుంటున్న ఇరాన్‌

టెహ్రాన్‌: ఇరాన్‌ సేనలు రణక్షేత్రంలో అమెరికా సైనికులతో తలపడుతుంటే ఇరాన్‌ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెటకారపు మాటలతో ట్రంప్‌ను చీల్చి చెండాడుతున్నాయి. వెక్కిరింతలతో, మీమ్స్‌తో ట్రంప్‌పై విరుచుకుపడుతున్నాయి. దీంతో నెటిజన్లకు నవ్వుకోవడానికి భారీ సరుకే దొరికింది. ‘ఎక్స్‌’ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఇప్పుడీ మీమ్స్‌ తెగ షేర్‌ అవుతున్నాయి. 

వేల కోట్ల రూపాయల యుద్ధ విమానాలు, సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కుప్పకూలినా ట్రంప్‌ ఇంకా తామే గెలిచామనడంపై పశ్చిమఆఫ్రికాలోని సియారాలియోన్‌ దేశంలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఒక వెటకారపు ట్వీట్‌ పెట్టింది. దాంట్లో బాంబుల ధాటికి సూటు చిరిగిపోయి, దెబ్బలు తగిలి, జుట్టు చెదిరిపోయినా ట్రంప్‌ ‘మేమే గెలిచాం’అని గట్టిగా అరుస్తున్నట్లు ఒక ఏఐ ఫొటోను పెట్టి ‘‘అవును సర్‌. అంతా తగలబడినా మీరే గెలిచారు. 

ఇకనైనా ప్రశాంతంగా ఉండండి’’అనే క్యాప్షన్‌ను ఎంబసీ జతచేసింది. హార్మూజ్‌ను తెరవండి వెధవల్లారా అని ట్రంప్‌ తిట్టగా ‘అసలు అది మూసేయలేదుగా. మా నౌకలు హార్మూజ్‌ను ఇప్పుడే దాటేశాయిగా’’అని చైనా అన్నట్లు దక్షిణాఫ్రికాలోని ఇరాన్‌ ఎంబసీ మరో ట్వీట్‌ పెట్టింది. జలసంధిని తెరవాలని ట్రంప్‌ ఆదేశించగా తాళం చెవులు ఎక్కడో మరచిపోయామని మరో ట్వీట్‌ పెట్టారు. సొంత మాధ్యమం ‘ట్రూత్‌సోషల్‌’లో ట్రంప్‌ కొద్దిసేపు పోస్ట్‌లుపెట్టకపోతే ‘‘సార్‌. ఏదో ఒకటి మాట్లాడండి. ఏదో ఒకటి పోస్ట్‌ చేయండి. లేదంటే మాకు మహా బోర్‌ కొడుతోంది’’అని జింబాబ్వేలోని ఇరాన్‌ ఎంబసీ మరో ట్వీట్‌తో నవ్వించింది.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement