ఇరాన్ తుడిచిపెట్టుకునిపోవచ్చు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు | Donald Trump Live Latest Updates | Sakshi
Sakshi News home page

Donald Trump: డెడ్‌లైన్‌కి ముందు ఇరాన్‌కి ట్రంప్ వార్నింగ్

Apr 6 2026 11:17 PM | Updated on Apr 7 2026 4:28 AM

Donald Trump Live Latest Updates

ఇరాన్‌కి విధించిన గడువు ముగియనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రెస్ మీట్ పెట్టారు. వైట్ హౌస్‌లో మాట్లాడుతూ తమ దేశానికి చెందిన రెండో పైలట్‌ని కూడా ఇరాన్ నుంచి రక్షించామని చెప్పుకొచ్చారు. అలానే డెడ్‌లైన్‌కి ముందు ఇరాన్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

'రేపటి(మంగళవారం) వరకు ఇరాన్‌కి గడువు ఉంది. డెడ్ లైన్ తర్వాత ఇరాన్‌కి గడువు పొడిగింపు ఉండదు. ఇరాన్ దిగిరాకపోతే ఆ దేశ మౌలిక సౌకర్యాలపై దాడులు చేస్తాం. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విజయవంతంగా కొనసాగుతుంది. రెండో పైలట్‌ని ఇరాన్ నుంచి సురక్షితంగా తరలించాం. అతడి కోసం భారీ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌ని సమర్థంగా నిర్వహించినందుకు గర్విస్తున్నాం. ఏడు గంటల పాటు జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అమెరికన్ సైనికులు గాయపడలేదు'

'ఏ దేశానికి లేని విధంగా అమెరికాకు ఆయుధాలు ఉన్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాం. శత్రువులకు చిక్కకుండా ఎత్తయిన కొండపైకి పైలెట్ చేరుకున్నాడు. అన్ని ప్రమాదాలని ధ్వంసం చేసి పైలట్‌ని రక్షించాం. మా హెలికాప్టర్లు పది నిమిషాల్లో తమ పని పూర్తిచేశాయి. వేలాది విమానాలతో దాడి చేస్తే ఇరాన్ ఒక్క విమానాన్నే కూల్చింది. రేపు ఇరాన్ తుడిచిపెట్టుకునిపోవచ్చు' ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.

శుక్రవారం ఇరాన్‌ ఐఆర్‌జీసీ దళాలు ఎఫ్‌-15ఈ ఫైటర్‌ జెట్‌ను కూల్చిశాయి. దీంతో అందులో ఉన్న పైలట్‌, మరో పైలట్‌ (వెపన్‌ ఆఫీసర్‌) ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే వారిలో ఒకరిని అమెరికా ముందుగానే రక్షించింది. రెండో పైలట్‌ని చాలా కష్టపడి రక్షించుకుంది. హాలీవుడ్‌ సినిమాను తలపించే రీతిలో 24 గంటలకు పైగా సాగిన ఈ ఆపరేషన్‌లో అదృష్టం రెండు దేశాల వైపు దోబూచులాడి చివరికి అగ్ర దేశాన్నే వరించింది. శత్రుగడ్డపై చిక్కుకున్న తమ పైలట్‌ను అమెరికా బలగాలు ప్రాణాలకు తెగించి రక్షించాయి.

అంతకు ముందు అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనని ఇరాన్‌ తిరస్కరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. 'నేను చాలా నిరాశకు గురయ్యాను. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు' అని హెచ్చరించారు. ఇరాన్‌ చేయాల్సినవి చేస్తే ఈ ఉద్రిక్తతలు త్వరగా ముగిసిపోవచ్చని పేర్కొన్నారు. ఆ దేశానికి విధించిన గడువును మంగళవారం తర్వాత ఇక పొడిగించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి ప్రెస్‌మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement