కాల్పుల విరమణకు ఇరాన్‌ నో!..హెచ్చరించిన ట్రంప్‌ | USA President Donald Trump has once again warned Iran | Sakshi
Sakshi News home page

కాల్పుల విరమణకు ఇరాన్‌ నో!..హెచ్చరించిన ట్రంప్‌

Apr 7 2026 4:16 AM | Updated on Apr 7 2026 6:29 AM

USA President Donald Trump has once again warned Iran

మధ్యవర్తుల ప్రతిపాదనకు తిరస్కరణ 

తాజాగా అమెరికాకు 10 షరతులు

భారీ మూల్యం చెల్లిస్తారని హెచ్చరించిన ట్రంప్‌ 

మరో 24 గంటల్లో హార్మూజ్‌ను తెరవాల్సిందే 

లేదంటే ఇరాన్‌ను బుగ్గి చేసేస్తామన్న అధ్యక్షుడు 

భారీగా జేఏఎస్‌ఎస్‌ఎం క్షిపణుల మోహరింపు! 

ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌ 

ఐఆర్‌జీసీ నిఘా సారథి, ఖుద్స్‌ ఫోర్స్‌ నేత హతం 

ఇరాన్‌లో 30 మంది, ఇజ్రాయెల్‌లో నలుగురు మృతి

దుబాయ్‌/జెరూసలేం/వాషింగ్టన్‌: నెలన్నర రోజులుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రతరమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి. కాల్పులకు 45 రోజుల పాటు విరామం ఇచ్చేలా అమెరికా, ఇరాన్‌లను ఒప్పించేందుకు ఈజిప్టు, టర్కీ, పాకిస్తాన్‌ సోమవారం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాల్పులకు విరామంతో పాటు హార్మూజ్‌ జలసంధిని తెరవడం తదితరాలతో కూడిన ప్రతిపాదనను ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ, పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక దూత స్టీవ్‌ విట్కాఫ్‌కు ఆయా దేశాల ప్రతినిధులు అందజేశారు. 

కానీ ఈ ప్రతిపాదనను ఇరాన్‌ పూర్తిగా తిరస్కరించింది. ‘‘తాత్కాలిక కాల్పుల విరమణ కోసం హార్మూజ్‌ను తెరవడం ఇరాన్‌కు ఏ మాత్రమూ అంగీకారం కాదు. ఈ విషయాలన్నింటినీ పాక్‌ ద్వారా ఇప్పటికే అమెరికాకు తెలియజేశాం’’ అని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా  సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ వెల్లడించింది. యుద్ధానికి శాశ్వతంగా తెర దించడం మినహా మరేదీ తమకు అంగీకారయోగ్యం కాదని కైరోలోని ఇరాన్‌ దౌత్య బృందం సారథి మొజ్తబా ఫిర్‌దౌసీ పోర్‌ కుండబద్దలు కొట్టారు! అంతేగాక యుద్ధానికి తెర దించే విషయమై ఇరాన్‌ తాజాగా అమెరికాకు 10 షరతులు కూడా విధించింది!

 ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. హార్మూజ్‌ను తెరవడంపై కూడా అంతకుముందే ఇరాన్‌కు ఆయన మరిన్ని హెచ్చరికలు చేశారు. ‘‘మీకు మంగళవారం రాత్రి 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5) గంటల వరకే గడువు. ఆలోపు దిగిరాకుంటే కనీవినీ ఎరగని దాడులతో సర్వనాశనం చేసేస్తాం’’ అంటూ హెచ్చరించారు. ఇరాన్‌పైకి అమెరికా ఇప్పటికే అత్యాధునిక లాంగ్‌ రేంజ్‌ జేఏఎస్‌ఎస్‌ఎం–ఈఆర్‌ క్షిపణులను భారీ సంఖ్యలో ఎక్కుపెట్టినట్టు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి! 

సౌత్‌ పార్స్‌పై ఇజ్రాయెల్‌ దాడులు
ఇజ్రాయెల్, అమెరికా సోమవారం ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇరాన్‌కు అత్యంత కీలకమైన సౌత్‌ పార్స్‌ చమురు క్షేత్రంపై కూడా ఇజ్రాయెల్‌ భారీగా దాడులకు దిగింది. దాంతో అక్కడి పెట్రో కెమికల్‌ ప్లాంటుకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం. టెహ్రాన్‌పై యుద్ధ విమానాలు గంటల తరబడి అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ బాంబుల వర్షం కురిపించాయి. 

ఈ దాడుల్లో రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ) నిఘా విభాగం అధిపతి మజీద్‌ ఖదేమీ మరణించినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అంతేగాక ఐఆర్‌జీసీకి చెందిన ఖుద్స్‌ ఫోర్స్‌ కీలక నేత అస్ఘర్‌ బకేరీని కూడా అంతం చేసినట్టు పేర్కొంది. రాజకీయ, సైనిక ప్రముఖులందరినీ ఒక్కొక్కరుగా అంతం చేసి తీరతామని స్పష్టం చేసింది. మజీద్‌ మృతిని ఇరాన్‌ అధికారిక మీడియా కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో టెహ్రాన్‌లోని షరీఫ్‌ యూనివర్సిటీలో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా విద్యార్థులెవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఎస్లాంషార్‌ నగరంపై దాడుల్లో 15 మంది దాకా మరణించినట్టు అధికారులు వెల్లడించారు. కోమ్‌ నగరంలో పౌర ఆవాసాలపై దాడుల్లో ఐదుగురు, ఇతరచోట్ల మరో ఆరుగురి దాకా మృతి చెందారన్నారు. టెహ్రాన్‌లో ఓ ఇంటిపై జరిగిన దాడికి మరో ముగ్గురు బలయ్యారు. లెబనాన్‌లో కూడా దాడులను ఇజ్రాయెల్‌ తీవ్రతరం చేసింది. ఐన్‌ సాదే నగరంలో లెబనాన్‌ సైనికాధికారి ఒకరు దాడుల్లో మరణించారు.

ఒక్క రాత్రిలోనే నాశనం చేసేస్తాం
ఇరాన్‌కు ట్రంప్‌ తాజా హెచ్చరికలు 
ఇరాన్‌ అంతటినీ ఒకే ఒక్క రాత్రిలో సర్వనాశనం చేసేయగల సత్తా అమెరికా సొంతమని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ‘‘అది బహుశా మంగళవారం రాత్రే కావచ్చు’’ అంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయన హెచ్చరించారు. ఇరాన్‌ భూభాగం నుంచి ఎఫ్‌–15ఇ యుద్ధ విమానం తాలూకు ఎయిర్‌మ్యాన్‌ను కాపాడేందుకు అమెరికా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ చరిత్రాత్మకమని అభివరి్ణంచారు. అందుకోసం ఏకంగా 155 యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్టు చెప్పుకొచ్చారు! దీని గురించి తొలుత రిపోర్ట్‌ చేసిన అమెరికా జర్నలిస్టు ఓ అత్యంత పనికిమాలిన వ్యక్తి అంటూ అధ్యక్షుడు మండిపడ్డారు. ‘‘అతను చేసిన పని వల్ల రెస్క్యూ ఆపరేషన్‌ గురించి ఇరాన్‌కు తెలిసిపోయింది. దాంతో అందులో పాల్గొన్న సైనికులందరి ప్రాణాలూ ముప్పులో పడ్డాయి’’ అంటూ దుయ్య బట్టారు. సదరు కథనానికి సోర్స్‌ ఏమిటో బయట పెట్టకుంటే ఆ జర్నలిస్టును జైల్లో పెడతామని హెచ్చరించారు.   

ఇరాన్‌ షరతులివే! 
→ పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా మొదలుపెట్టిన యుద్ధానికి తక్షణం తెర దించాలి 
→ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ మరింకెప్పటికీ దండెత్తరాదు. ఈ మేరకు ఇరు దేశాలూ స్పష్టమైన హామీలివ్వాలి 
→ ఇరాన్‌పై ఆర్థిక తదితర ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలి 
→ ఇరాన్‌ పునర్నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులివ్వాలి 
→ హార్మూజ్‌ను పూర్తిస్థాయిలో తెరవాలంటే మేం రూపొందించే ప్రొటోకాల్స్‌కు కట్టుబడాలి  

Advertisement
 
Advertisement
Advertisement