
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.
ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం
సింధు నది నుండి నీటిని మళ్లించి,పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్‌లోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు,తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు,ఐఎంఎఫ్ ఒత్తిడితో పంటలకు కనీస మద్దతు ధర (MSP) నిలిపివేయడం
కార్పొరేట్ వ్యవసాయం కోసం వారసత్వ భూములను బలవంతంగా సేకరించడం
లాభం కోసం పాకిస్తాన్ సైన్యం సైతం వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం.. వంటి అంశాలపై పాక్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. తాజాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంతో అక్కడ నిరసనలు మిన్నంటాయి. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆందోళనకు దారితీసింది. ఇది ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.పోలీసు అధికారులతో సహా అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు మోరోలోని హోంమంత్రి ఇంటిపై కూడా దాడి చేసి తగలబెట్టారు.
House of Sindh Interior Minister Ziaul Hasan🇵🇰 pic.twitter.com/hQdD02tBBj
— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) May 21, 2025
పోలీసు చర్యకు ఆదేశించినందుకు స్థానికులు మంత్రిపై మండిపడుతున్నారు. నీటి కొరత కారణంగా సింధ్ విధ్వంసానికి దారితీసే విధానాలకు ఆయన మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులు ఆసుపత్రిలో గాయపడిన పోలీసు అధికారులపై దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు యూరియా ఇతర ఎరువులతో వెళ్తున్న ట్రక్కులను దోచుకుని ఆపై వాటిని తగలబెట్టారు.
స్పందించిన పాక్ ప్రభుత్వం
ఈ ఆందోళనపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధ్‌లో భద్రతను బలోపేతం చేసే దిశగా పారామిలిటరీ దళాలను మోహరించారు. దాడులలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పహల్గాం ఉగ్రదాడితో
పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.దీంతో పాక్‌లో నీటి సమస్య ఉత్పన్నమవుతున్నాయి.