కామ్రేడ్‌ బాలా కన్నుమూత

Indian descent Maoist leader Aravindan Balakrishnan Passed Away - Sakshi

యూకే జైలులో మృతిచెందిన మావోయిస్టు నేత

లండన్‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో భారత సంతతికి చెందిన మావోయిస్టు నేత అరవిందన్‌ బాలాకృష్ణన్‌ అలియాస్‌ కామ్రేడ్‌ బాలా(81) మృతి చెందారు. ఇంగ్లండ్‌లోని హెచ్‌ఎంపీ డార్ట్‌మూర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన శుక్రవారం మరణించినట్లు యూకే ప్రిజన్‌ సర్వీసు అధికారి ప్రకటించారు. లైంగిక వేధింపుల కేసులో యూకే కోర్టు 2016 జనవరిలో కామ్రేడ్‌ బాలాకు 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.

అసభ్య ప్రవర్తన కింద ఆరు కేసులు, అత్యాచారం కింద నాలుగు కేసులు, చిత్రహింసల కింద రెండు కేసుల్లో 23 ఏళ్లు జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. అప్పటి నుంచి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. లండన్‌లో రహస్యంగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన అరవింద్‌ బాలకృష్ణన్‌ను  అనుచరులు కామ్రేడ్‌ బాలా అని పిలుచుకునేవారు.  కామ్రేడ్‌ బాలా భారత్‌లోని కేరళ రాష్ట్రంలో ఓ గ్రామంలో జన్మించారు. సింగపూర్, మలేషియాలో పెరిగారు.

అక్కడే కమ్యూనిస్టు నాయకుడిగా చెలామణి అయ్యారు. సింగపూర్‌ పౌరసత్వం పొందారు. 1963లో యూకేకు చేరుకున్నారు. ప్రఖ్యాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. అక్కడే టాంజానియాకు చెందిన చందా పాట్నీని కలిశారు. 1969లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. సొంత కుమార్తెను 30 ఏళ్లపాటు బంధించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన నేరం రుజువయ్యింది. సేవా కార్యక్రమాల ముసుగులో ఎంతోమంది మహిళలపై బాలా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, వారిని క్రూరంగా హింసించాడని స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు అప్పట్లో న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top