అమెరికాలో ‘ఉల్లి’ హడల్‌!

Hundreds of People became ill United States Of America Onions - Sakshi

అమెరికాలోని టెక్సాస్‌ ప్రాంతం. హుషారుగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ దంపతులు.. తినేసి ఇంటికి వచ్చారు. కాసేపటికే ఇద్దరికీ జ్వరం, వాంతులు, విరేచనాలు.. వెంటనే వెళ్లి ఆస్పత్రిలో చేరారు. అక్కడే మరో పట్టణం.. ఇంట్లో భోజనం చేసి పడుకున్న కుటుంబ సభ్యులంతా తెల్లారే సరికి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇలా కొద్దిరోజుల్లోనే వందల మంది అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఒకే సమస్య ‘సాల్మోనెల్లోసిస్‌’. సాల్మోనెల్లాగా పిలిచే ఓ రకం బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి. అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా ఆరా తీసి.. ఇదెలా వ్యాపిస్తోందన్నది తేల్చారు. ఆ కారణం ఏమిటో తెలుసా.. జస్ట్‌ ఉల్లిపాయలు. దీంతో అమెరికావ్యాప్తంగా ఒక్కసారిగా ఉల్లి అంటే హడల్‌ మొదలైంది. 

ఎక్కడి నుంచి వచ్చింది? 
అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు.. అక్కడి 37 రాష్ట్రాల్లో సాల్మోనెల్లోసిస్‌ బారినపడ్డ పేషెంట్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. వారు కొద్దిరోజులుగా ఏమేం తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్లారనేది ఆరా తీశారు. అన్నిచోట్లా కామన్‌గా వచ్చిన సమాధానం ఉల్లిపాయలే. ఇందులో చాలావరకు అమెరికాకు చెందిన ప్రోసోర్స్‌ అనే సంస్థ.. పొరుగుదేశమైన మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్నవే. దీంతో అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) వెంటనే హైఅలర్ట్‌ జారీ చేసింది. ప్రోసోర్స్‌ సంస్థ ద్వారా సరఫరా అయిన ఉల్లిపాయలన్నింటినీ.. వెంటనే పారబోయాలని ఆదేశించింది. ఆ ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కూడా పడేయాలని.. ఆయా ప్రాంతాలను శానిటైజ్‌ చేయాలని సూచించింది. 

► అమెరికాలో సిట్టెరో బ్రాండ్‌ పేరిట విక్రయిస్తున్న ‘సలామీ స్టిక్స్‌ (మాంసాహార వంటకం)’తోనూ సాల్మోనెల్లా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్లు, సూపర్‌మార్కెట్లు, ఇతర దుకాణాల్లో ఉన్న స్టాక్‌ను పడేయాలని ఆదేశించారు.  

వృద్ధులు, పిల్లలకు డేంజర్‌! 
సాల్మోనెల్లా మరీ ప్రమాదకరం కాకున్నా.. వృద్ధులు, చిన్నపిల్లలకు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి మాత్రం డేంజరేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి వారిలో తీవ్ర జ్వరం, రక్త విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని.. శరీరంలో డీహైడ్రేషన్, ఇతర ఇన్ఫెక్షన్లు ఏర్పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

పరిశుభ్రతే పరిష్కారం 
అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివాటి ద్వారా సాల్మోనెల్లాతోపాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. 
► పరిసరాల పరిశుభ్రత, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం, మాంసం, పండ్లు, కూరగాయలు వంటివాటిని శుభ్రంగా కడిగి ఉపయోగించడం, ఆహారాన్ని సరిగా ఉడికించడం, పాలను బాగా మరగబెట్టడం వంటివాటి ద్వారా సాల్మొనెల్లా, ఈకొలికి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు.  

ఏమిటీ ‘సాల్మోనెల్లా’?
సాల్మోనెల్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాక్టీరియా. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా మాంసాహారం, గుడ్లలో ఈ బ్యాక్టీరియా ఎదుగుతుంది. సరిగా కడగని పండ్లు, కూరగాయల మీద కూడా ఉంటుంది. అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివి ఈ బ్యాక్టీరియా పెరగడానికి, వ్యాపించడానికి కారణం. 
► ప్రస్తుతం అమెరికాలో సాల్మోనెల్లా బారినపడ్డ వారిలో చాలా మంది.. సరిగా కడగని, పచ్చి ఉల్లిపాయలు తిన్నట్టు గుర్తించారు. 
► శరీరంలో ప్రవేశించిన నాలుగైదు గంటల్లో ప్రభావం చూపించడం మొదలవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. తీవ్ర నీరసం ఆవహిస్తుంది. సాధారణంగా వారం రోజుల్లోపే ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. మందులు వాడితే వేగంగా కోలుకోవచ్చు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top