లక్ష్యాలుగా నిర్లవణీకరణ కేంద్రాలు..
ఇరాన్ ఆయుధం... జలం!
తాగేందుకు నీటి చుక్క దక్కదు
గల్ఫ్ దేశాలకు ‘దాహార్తి’ భయం
తీర ప్రాంతాల్లోని నిర్లవణీకరణ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తే గల్ఫ్ దేశాల గొంతెండిపోతుంది. సముద్ర జలాల్లోని ఉప్పును తొలగించి, శుద్ధ జలంగా మార్చే ప్లాంట్లు ఇవి. ఈ నెల మొదట్లో బహ్రెయిన్ దేశంలోని ‘ముహార్రక్’పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ డీశాలినేషన్ ప్లాంటు దెబ్బతింది. దైనందిన తాగునీటి అవసరాల కోసం గల్ఫ్ దేశాలు ప్రధానంగా ఈ నిర్లవణీకరణ కేంద్రాలపై ఆధారపడుతున్నాయి. ఈ ప్లాంట్ల నిర్వహణ ఇప్పుడు భద్రతాపరమైన అంశంగా మారింది.
నిర్లవణీకరణ జలాన్ని ప్రపంచంలో అధికంగా వినియోగిస్తున్నది గల్ఫ్ దేశాలే. వీటి తీరప్రాంతాల్లో వందలాది డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. కువైట్ ప్రాంతంలో 90 శాతం తాగునీరు ఇదే. తీర నగరాలు, విద్యుత్కేంద్రాలు, పారిశ్రామిక హబ్స్ వద్ద ఈ డీశాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇదిప్పుడు వాటి బలహీనతగా, ఇరాన్ ఆయుధంగా మారుతోంది. నిర్లవణీకరణ కేంద్రాల్ని లక్ష్యాలుగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరికలు పంపుతోంది.
విద్యుత్ సరఫరాతోనే డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేస్తాయి. విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తే అవి మూతపడతాయి. ఉద్రిక్తతలు పెరిగితే డీశాలినేషన్ ప్లాంట్లు, విద్యుత్కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తుందేమోనని, అప్పుడిక గృహావసరాలు, ఆస్పత్రులు, పరిశ్రమలకు నీరు అందదేమోనని గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఇది వాటి ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగించే పరిణామమే. అయితే ఈ రిస్క్ అన్ని గల్ఫ్ దేశాలకు ఒకేలా లేదు. మిగతా వాటితో పోలిస్తే సౌదీ, ఖతార్, యూఏఈల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.
- జమ్ముల శ్రీకాంత్
Sources: SANA (Syrian Arab News Agency), Gulf News


