ఈ నగరాలు...సముద్రం పాలు! | Global sea levels could rise up to 1. 9 meters by 2100 | Sakshi
Sakshi News home page

ఈ నగరాలు...సముద్రం పాలు!

Jun 8 2025 5:01 AM | Updated on Jun 8 2025 5:01 AM

Global sea levels could rise up to 1. 9 meters by 2100

తీరప్రాంతాలను శరవేగంగా కబళిస్తున్న కడలి 

ప్రపంచమంతటా పెరుగుతున్న సముద్రమట్టాలు 

సమస్యకు చెక్‌ పెట్టేందుకు దేశాల ప్రయత్నాలు

నదీజలాలు. నాగరికతకు పుట్టినిళ్లు. అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఉగ్రరూపంలో ఉప్పొంగినా తర్వాత సాధారణ స్థితికి వచ్చి మానవులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ సముద్రజలాలు అలాకాదు. ప్రపంచవ్యాప్తంగా సముద్రతీరమున్న ఎన్నో పట్టణాలను ఇప్పుడు సముద్రజలాల పెరిగే నీటిమట్టాలు అక్కడి ప్రజల్లో ఆందోళన మట్టాలను అమాంతం పెంచేస్తున్నాయి. 

తరతరాలుగా తీరప్రాంతాల్లోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని ఉంటున్న స్థానికులను సాగరజలాలు ఇప్పుడు బద్ధశత్రువుగా మారాయి. తీవ్రమైన వ్యాధి శరీరాన్ని కబళించినట్లు ఈ సముద్రజలాలు నెమ్మదిగా ఆయా తీరప్రాంతాల సమతల భూభాగాలను శాశ్వతంగా తనలో కలిపేసుకుంటున్నాయి. శరవేగంగా పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలు ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి.

 ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా తీరప్రాంతాల్లో సముద్ర నీటిమట్టాలు ఇటీవలికాలంలో  చాలా అత్యధిక వేగంతో పెరుగుతున్నాయని సింగపూర్‌లోని నాంయాంగ్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ(ఎన్‌టీయూ) శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టారు. 2014 నుంచి చూస్తే గత ఆరేళ్లలోనే ఏటా ఒక సెంటీమీటర్‌ ఎత్తు సముద్రజలాల నీటిమట్టం పెరుగుతూ తీరప్రాంతాలను శాశ్వతంగా ముంచేసినట్లు తాజా అధ్యయనంలో తేలింది. 

ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, ద.అమెరికా ఖండాల్లో 48 తీరనగరాలకు తీరనిశోకంగా సాగరజలాలు మారాయని అధ్యయనం పేర్కొంది. వాతావరణ మార్పులకుతోడు కుంగిపోతున్న భూమి కారణంగా ఈ సమస్య తీవ్రమవుతోందని తేలింది. రెండేళ్ల క్రితం ఈశాన్యచైనాలోని తియాంజిన్‌ నగరంలో తీరప్రాంత వీధులన్నీ కుంగడంతో వేలాది మందిని అపార్ట్‌మెంట్ల నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. 2014 నుంచి 2020 ఏడాది వరకు చూస్తే తియాంజిన్‌ నగర భూభాగం ఏటా 18.7 సెంటీమీటర్లమేర కుంగింది. సముద్రజలాలు పెరిగి భూగర్భజలాలు పెరగడంతో నేల కుంగింది. 

ముంపు బారిన ముంబై 
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరాన్నీ ముంపు సమస్య పట్టిపీడిస్తోంది. 2014 నుంచి చూస్తే సంవత్సరానికి 0.01 సెం.మీ.ల నుంచి 5.9 సెంటీమీటర్ల స్థాయిలో ముంబైలోని చాలా ప్రాంతాలను సముద్రనీరు ముంచేసింది. ఏటా 1 సెం.మీ.చొప్పున నేల సముద్రజలాల్లో కలిసిపోతున్న చోట్ల 62 లక్షల మంది జీవిస్తున్నట్లు ఎన్‌టీయూ అధ్యయనకారులు ప్రకటించారు. మాతుంగా ఈస్ట్‌లోని కింగ్‌ సర్కిల్‌ స్టేషన్‌ ప్రాంతం వేగంగా ముంపునకు గురవుతోంది. 

ఇక్కడ ఏటా 2.8 సె.మీ.ల మేర సముద్రజలాలు పెరుగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సాగరజలాలు గత ఏడాది 0.59 సెంటీమీటర్లమేర ఎగిశాయని నాసా అధ్యయనంలో స్పష్టమైంది. భూగర్భజలాలను విచ్ఛలవిడిగా తోడేయడం, ఊహించనంత బరువుతో ఆకాశహర్మ్యాలను నిర్మించడం, నిరాటంకంగా కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్ట్‌ పనులు, చిత్తడినేలలను ప్రభుత్వాలు పునరుద్ధరించడం తదితర కారణాలు సైతం మహానగరంలోకి సాగరజలాలు చొచ్చుకొచ్చేలా చేస్తున్నాయి. కనీసం 50 లక్షల జనాభా ఉన్న సముద్రతీర నగరాల వెంట సముద్రనీటిమట్టాలు పెరుగుతున్న అంశాన్ని ఉపగ్రహాల సాయంతో విశ్లేషించి ఈ అధ్యయనం చేశారు. 

అగ్రరాజ్యంలోనూ.. 
అమెరికాలోని మయామీ సిటీని సాగరజలాలు ముంచెత్తుతున్నాయి. 2014 నుంచి 2020 వరకు చూస్తే మయామీ సిటీలో కోకోనట్‌ గ్రోవ్‌సహా చాలా ప్రాంతాలు గరిష్టంగా 2.2 సెంటీమీటర్లమేర సముద్రజలాల మట్టాలు పెరిగాయి. ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న ప్రాంతాలు 43,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. 

న్యూయార్క్‌ నగరంలోని క్వీన్స్‌ పరిధిలోని బ్రీజీ పాయింట్‌ వద్ద నీరు ఏటా 3 సె.మీ.ల మేర పెరుగుతోంది. ఇక్కడ ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న చోట 1,03,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. లాస్‌ ఏంజెలిస్‌ సిటీలోని శాన్‌ పెడ్రో సహా పలు తీర ప్రాంతాల్లో నీరు ఏటా 2.5 సె.మీ.ల మేర పెరుగుతోంది. హ్యూస్టన్‌ సిటీ పరిధిలో గరిష్టంగా ఏకంగా 11 సెం.మీ. మేర సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. హ్యూస్టన్‌లోని సెంట్రల్‌ సౌత్‌వెస్ట్‌ ప్రాంతంలో ఏటా 8 సెం.మీ.ల మేర సముద్రనీరు పైకొస్తోంది.

కొత్త పరిష్కారం చూపుతున్న జపాన్‌ 
భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేస్తున్న జపాన్‌ ఇప్పుడు సముద్రమట్టాల పెరుగుదల ముప్పుకూ మరో పరిష్కారం వెతికింది. విచ్ఛలవిడిగా భూగర్భజలాలను వాడడంతో నేల కుంగి పరోక్షంగా సముద్రనీరు చొచ్చుకొస్తున్న నేపథ్యంలో గ్రౌండ్‌వాటర్‌ అతి తోడివేతకు చెక్‌ పెట్టింది. ఈ విషయంలో కఠిన నిబంధనలను అమలుచేస్తోంది. పటిష్టవంతమైన నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటుచేసింది. 2014 ఏడాది నుంచి చూస్తే 0.01–2.3 సె.మీ.ల స్థాయిలో నేల కుంగినా ఇప్పుడు మాత్రం ఆ దురవస్థ నుంచి కాస్తంత బయటపడింది. 

ఎగువ ప్రాంతాలు, అడువులు, నదుల నుంచి సిటీ వైపుగా వచ్చే నీటిని నగరానికి దూరంగా ఉన్న రెండు రిజర్వాయర్లలో నింపుతోంది. అక్కడి నుంచి అవసరమైన మేరకే నీటి నగరంలో జనావాసాలకు, పరిశ్రమలకు సరఫరాచేస్తోంది. అయితే జపాన్‌ మోడల్‌ అన్ని దేశాలకు పనికొస్తుందో లేదో తెలీదు. పైగా ఇది అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని జపాన్‌లోని వసేడా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ మిగూయెల్‌ ఎస్తిబాన్‌ అభిప్రాయపడ్డారు. భూగర్భజలాల అతి తోడివేతను తగ్గించుకుని తైపే నగరం ఈ సమస్య నుంచి కాస్తంత బయటపడింది. దీనికితోడు బ్యాంకాక్, అమెరికాలోని హ్యూస్టన్, బ్రిటన్‌లోని లండన్‌ నగరాలు సైతం భూగర్భజాలాల అతివాడకానికి చరమగీతం పాడాయి.

భూగర్భజలాలు పైకి రావడానికి కారణాలెన్నో.. 
తీర ప్రాంతాల వెంట భవనాల నిర్మాణం, గనుల తవ్వకం, భూఫలకాల కదలికలు, భూకంపాలు, సహజంగా భూమిపొరలు ఒత్తకునిపోవడం తదితర కారణాలతో భూమి కాస్తంత కుంగుతుంది. వీటికితోడు కింది పొరలో భూగర్భజలాలు ఉన్న చోటు నుంచి మనం నీటిని తోడేసి ఖాళీచేస్తున్నాం. దీంతో అప్పటిదాకా భూగర్భజలాలపై ఉన్న శిలలు, నేల పొరలు కిందకు పడిపోతున్నాయి. ఇలా భూమి కుంగుతోంది. ‘‘ అత్యధికంగా భూమి కుంగుతున్న 48 తీరప్రాంతాల్లో సగం ప్రాంతాలు ఈ సమస్యకు అతిగా భూగర్భజలాలను తోడేయడమే కారణం’’ అని ఎన్‌టీయూ పరిశోధనలో కీలక పరిశోధకురాలు చెరిక్‌ టే చెప్పారు.

 జకార్తా వంటి నగరాల్లో భూగర్భజలాలను వెలికితీయడం మరీ ఎక్కువైందని ఆయన వెల్లడించారు. ‘‘ అత్యధిక అభివృద్ధి ప్రాజెక్టులు, జనాభా ఉన్న దేశాల్లో అధిక భూగర్భజలాల వినియోగం కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రమవుతోంది. తక్కువ ఎత్తున్న డెల్టా ప్రాంతాల్లో వెలిసిన నగరాలకు ఈ సమస్య మరీ ఎక్కువ. సముద్రంలో కలవడానికి ముందే ఎక్కువ పాయలుగా విడిపోయి ప్రవహించే నదుల వెంట ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. జకార్తా, బ్యాంకాక్, హో చి మిన్‌ సిటీ, షాంఘైలకు ఈ ముంపు ముప్పు ఎక్కువ. 

జకార్తా సిటీలో సగం ప్రాంతాలు సముద్ర నీటిమట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం గమనార్హం. 1970 ఏడాదితో పోలిస్తే జకార్తాలో ప్రస్తుతం పలు ప్రాంతాలు 4 సెం.మీ. కుంగిపోయాయి. ఈ కారణంగానే తీరానికి కాస్తంత దూరంగా నుసంతారా పేరిట కొత్త రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తోంది. ‘‘ తీరం వెంట మా ఇల్లు ఉంది. ఇంటి కిటికీలు నా చిన్నప్పుడు మెడ ఎత్తులో ఉండేవి. ఇప్పుడు మోకాలు ఎత్తుకు వచ్చేశాయి. నేలపై సముద్రనీరు చొచ్చుకొచ్చి నప్పుడల్లా మా ఇంటి అడుగును పూడుస్తూ వచ్చాం. దీంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఇంటి ఎత్తు తగ్గుతూ వస్తోంది. చివరకు గ్రౌండ్‌ఫ్లోర్‌ మొత్తం మునిగిపోతుందో, ఇల్లే కూలిపోతుందో మాకే అర్థంకావట్లేదు’’ అని నార్త్‌ జకార్తాలోని ఎర్నా, ఆమె తల్లి సోనీ వాపోయారు.  

తాత్కాలిక ప్రత్యామ్నాయాలు 
జకార్తా, ఈజిప్‌్టలోని అలెగ్జాండ్రియా, వియత్నాంలోని హో చీ మిన్‌ సిటీల్లోకి పెరిగిన సముద్రమట్టాలు చొచ్చుకురాకుండా గోడలు, అవరోధాలు నిర్మించారు. వచ్చిన నీరు అక్కడే తిష్టవేయకుండా కందకాల వంటి తవ్వి నీటిని మరో చోటుకు మళ్లించారు. అయితే ‘‘గోడలు ఒకరకంగా మంచిచేస్తే మరోరకంగా చేటుచేస్తున్నాయి. ఎగువ నుంచి వరద వస్తే మళ్లీ ముంపు సమస్య అలాగే ఉండిపోతుంది’’ అని ఇటలీలోని పడోవా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ పెట్రో తియాటినీ చెప్పారు.  

షాంఘై వినూత్న పంథా 
షాంఘై నగరం వాటర్‌ ఇంజెక్షన్‌ అనే కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. యాంగ్జే నది నుంచి సేకరించిన నీటిని శుద్ధిచేసి ఆ నీటిని బావులు, ఇతర మార్గాల ద్వారా నేలలోకి పంపిస్తోంది. నీటిని తోడేందుకు వేసిన బోరుబావుల రంధ్రాల నుంచి నీటిని నేలలోకి పంపుతోంది. అలా భూగర్భజలాల మట్టాలను పెంచుతోంది. తద్వారా భూగర్భజలాల సమతుల్యతను కాపాడుతోంది. చైనాలోని చోంగ్‌క్విన్, ఎల్‌సాల్విడార్‌లోని శాన్‌ సాల్విడార్‌ సిటీలో ‘స్పాంజ్‌ సిటీ’ పంథాలో వెళ్తున్నాయి. అత్యధిక నీటిని పీల్చుకునే మట్టిరకం, చెట్లు, గడ్డిని పెంచుతున్నాయి. అదనంగా వచ్చిన నీరు పార్కుల్లోకి, చిత్తడినేలల్లోకి వెళ్లేలే ఏర్పాట్లుచేశారు. ‘‘అదనపు నీటిని నిల్వచేసేందుకు పేద్ద రిజర్వాయర్‌ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీనితో పలిస్తే పదో వంతు వ్యయంతోనే సమస్యకు పరిష్కారం వెతకొచ్చు’’ అని వర్జీనియా టెక్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌ మనోòÙహర్‌ షెర్జాయీ చెప్పారు.      

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
Advertisement