మంటల్లో విమానం! | Five dead After Japan Airlines Plane Collision at Tokyo Airport | Sakshi
Sakshi News home page

మంటల్లో విమానం!

Jan 3 2024 8:05 AM | Updated on Jan 3 2024 8:05 AM

Five dead After Japan Airlines Plane Collision at Tokyo Airport - Sakshi

టోక్యో: తీవ్ర భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం చోటుచేసుకోవడంతో పెనువిషాదంలో మునిగిపోయిన జపాన్‌లో మరో దుర్ఘటన జరిగింది. భూకంప బాధితుల కోసం సహాయక సామగ్రిని చేరవేయాల్సిన విమానం ప్రమాదంలో చిక్కుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయం రన్‌వేపై ల్యాండ్‌ అవుతున్న విమానం మరో విమానాన్ని ఢీకొట్టింది. మొదటి విమానంలో ఉన్న 379 మంది క్షేమంగా ప్రాణాలతో బయటపడడంతో ఊరటనిచ్చింది. ఏమాత్రం ఆలస్యం జరిగినా ఊహించని ఉత్పాతమే జరిగేదని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. రాజధాని టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టు జపాన్‌లో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి. 

నూతన సంవత్సరం సెలవుల సందర్భంగా ప్రయాణికుల రాకపోకలతో మంగళవారం మరింత రద్దీగా మారింది. హొక్కైడోలోని షిన్‌ చిటోస్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం జేఏఎల్‌–516(ఎయిర్‌బస్‌ ఏ–350) హనెడా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇందులో 12 మంది సిబ్బంది సహా మొత్తం 379 మంది ఉన్నారు. రన్‌వేపై దిగుతూ కుదుపులకు లోనైంది. రన్‌వేపై ల్యాండ్‌ అవుతూ, ఒక పక్కగా నిలిపి ఉన్న జపాన్‌ తీర రక్షక దళానికి చెందిన విమానం ఎంఏ–722ను అనూహ్యంగా ఢీకొట్టి కొద్దిదూరం దూసుకెళ్లి ఆగిపోయింది. క్షణాల వ్యవధిలోనే జేఏఎల్‌ విమానం రెక్క భాగంలో మంటలు చెలరేగాయి. 

అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే తలుపులు తెరిచి ప్రయాణికులకు బయటకు పంపించారు. మంటలు వేగంగా దూసుకొస్తున్నా లెక్కచేయకుండా ప్రయాణికులంతా బయటకు వచ్చారు. తర్వాత విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా పొగతో నిండిపోయింది. అగి్నమాపక సిబ్బంది మంటలను అర్పివేశారు. విమానం నుంచి ప్రయాణికులను భద్రంగా బయటకు పంపించిన అందులోని సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహారించాలన్న దానిపై వారికి శిక్షణ ఇచి్చనట్లు అధికారులు చెప్పారు.  

‘సాయం’ అందించకుండానే...
ప్రమాదం జరిగిన వెంటనే తీర రక్షక దళం విమానం పైలట్‌ అక్కడి నుంచి పరారయ్యాడని జపాన్‌ కోస్ట్‌గార్డు అధికారులు చెప్పారు. ఈ విమానంలో ఉన్న ఆరుగురు కోస్ట్‌గార్డు సిబ్బందిలో ఐదుగురు మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. కోస్ట్‌గార్డు విమానం సహాయక సామగ్రితో జపాన్‌ పశి్చమ తీరంలోని నిగాటాకు బయలుదేరాల్సి ఉంది. కానీ అక్కడి భూకంప బాధితులకు సామగ్రిని అందించకుండానే ప్రమాదం జరగడం, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోంది.

ఊపిరాడక నరకంలా అనిపించింది  
జేఏఎల్‌–516 విమానంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని 17 ఏళ్ల స్వీడి ఆంటోన్‌ డీబె మీడియాతో పంచుకున్నాడు. తొలుత ఏం జరిగిందో అర్థం కాలేదని, విమానం లోపలంతా దట్టమైన పొగ కమ్ముకుందని, ఊపిరాడక నరకంలా అనిపించిందని చెప్పాడు. సీట్లలో నుంచి కిందపడిపోయామని, ఎవరో ఎమర్జెన్సీ డోర్లు తెరవడంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement