నేడు ఆకాశంలో ఆకుపచ్చ తోకచుక్క.. రాతియుగం తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ అద్భుతం!

First sighting of green comet since Stone Age - Sakshi

విశ్వంలో సుదూర ప్రాంతం నుంచి ఓ తోకచుక్క.. భూమికి అతి చేరువగా వస్తోంది. గ్రీన్‌ కామెట్ అని పిలిచే ఈ తోకచుక్క.. 50 వేల ఏళ్ల క్రితం నియండర్తల్ పీరియడ్‌లో(రాతియుగం సమయంలో!) భూమికి దగ్గరగా వచ్చి దర్శనమిచ్చింది. మళ్లీ ఇప్పుడు.. ఇవాళ (బుధవారం) ఈ ఆకుపచ్చ తోకచుక్క భూమికి అతి సమీపంగా రాబోతోంది. ఆకాశంలో ఆవిష్కృతం కాబోయే ఈ అద్భుతాన్ని నేరుగా వీక్షించొచ్చని నాసా వెల్లడించింది.

వేల ఏళ్ల క్రితం కనిపించిన ‘గ్రీన్ కామెట్’ అనే తోకచుక్క మళ్లీ కనువిందు చేయబోతోంది. ఫిబ్రవరి 1-2 తేదీల మధ్య రాత్రి సమయంలో ఈ తోకచుక్క ఆకాశంలో సందడి చేయనుందట. చివరిసారిగా.. ఈ తోకచుక్క 50 వేల ఏళ్ల క్రితం కనిపించినట్టు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.  ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో ఇది కనిపిస్తుందని అంటున్నారు. ఈ 'గ్రీన్ కామెట్‌'ను కిందటి ఏడాది మార్చిలో కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఈ తోకచుక్కకు C/2022 E3 (ZTF)గా నామకరణం చేశారు. ఈ నెలలో అది భూమికి చేరువగా రావడం మొదలైంది.  కాగా, బుధవారం అంటే ఈ తోకచుక్క భూమికి 42 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి రానున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది.

అయితే ఈ ఆకుపచ్చ తోకచుక్కను నేరుగా కంటితో చూడడం కాస్త కష్టమేనని కోల్‌కతా బిర్లా ప్లానిటోరియం సైంటిఫిక్ అధికారి శిల్పి గుప్తా చెప్తున్నారు. కాంతి వెలుగులో ఇది మసకగానే కనిపిస్తుందని, స్పష్టమైన చీకట్లో..  బైనాక్యులర్ ద్వారా వీక్షించొచ్చని ఆమె సూచిస్తున్నారు. ఈ తోకచుక్క బుధవారం రాత్రి 9:30 తర్వాత ఆకాశంలో కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని చూడలేకపోతే జీవితంలో మళ్లీ చూడడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే ఇది మళ్లీ మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి సమీపానికి వస్తుంది. దీన్ని బృహస్పతి కక్ష్యలో ఉండగా గతేడాది మార్చిలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి నుంచి అది వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.

తోకచుక్కలు అంటే.. వాయువులతో నిండిన అంతరిక్ష మంచు గోళాలు. ఇవి దాదాపు ఒక నగరం అంత వ్యాసంతో ఉంటాయి. సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి ధూళిని, వాయువులను అమితమైన వెలుగుతో బయటకు వెదజల్లుతాయి. భూమిపై జీవం ఎలా ఏర్పడిందో తెలుసుకునేందుకు అంతరిక్ష పరిశోధకులు.. తోక చుక్కల సాయం తీసుకుంటుంటారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top