త్వరలోనే తెర దించుతాం: ట్రంప్
ఆ వెంటనే గల్ఫ్‌కు 10 వేల సేనలు!
ఇరాన్‌కు అధ్యక్షుని రెండు షరతులు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు యథాతథం
కొనసాగుతున్న హార్మూజ్ దిగ్బంధం
గల్ఫ్ వర్తకాన్నే స్తంభింపజేస్తాం: ఇరాన్
వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో సాయుధ పోరుకు అతి త్వరలో తెర పడుతుందని బుధవారం ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు వెల్లడించారు. కనుక చమురు ధరలు త్వరలోనే భారీగా దిగి రానున్నాయని జోస్యం చెప్పారు. మరో రెండు రోజుల్లో ప్రపంచం అద్భుతాలను చవిచూడనుందని అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. కానీ ఆ వెంటనే గల్ఫ్ ప్రాంతానికి మరో 10 వేల మంది అదనపు సైనికులను పంపుతూ అమెరికా రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది! వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ ఈ మేరకు వెల్లడించింది.
దీనికి తోడు చర్చలు తిరిగి ప్రారంభం కావాలంటే ఇరాన్‌కు ట్రంప్ తాజాగా రెండు షరతులు విధించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలని, చర్చల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) పూర్తి అధికారాలివ్వాలని డిమాండ్ చేశారు. దాంతో యుద్ధానికి త్వరలో తెర పడనుందన్న ట్రంప్ ప్రకటన వాస్తవ రూపు దాల్చడం అనుమానాస్పదంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే 50 వేల మంది అమెరికా సైనికులున్న విషయం తెలిసిందే. అమెరికా నావికా దళం ఆధ్వర్యంలో హార్మూజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతూనే ఉంది. ఇందుకు ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రంలో వర్తక మార్గాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది.
లెబనాన్‌పై భీకర దాడులు
టైర్ (లెబనాన్): లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. మంగళవారం ఇరు దేశాల నడుమ వాషింగ్టన్‌లో చర్చలు మొదలవడం తెలిసిందే. అయినా బుధవారం తీర నగరం టైర్‌పై క్షిపణులు, డ్రోన్లు, బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఎటు చూసినా కుప్పకూలిన భవనాలే దర్శనమిచ్చాయి. వీధులన్నీ వాటి శిథిలాలతో నిండిపోయాయి. దాడుల్లో పౌరులు భారీ సంఖ్యలో మరణించినట్టు లెబనాన్ పేర్కొంది.
బుర్జ్ అల్ అరబ్ హోటల్ మూత
ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటైన దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ 18 నెలల పాటు మూతబడనుంది. యుద్ధం ప్రాంరంభంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఈ హోటల్ తీవ్రంగా దెబ్బ తిన్నది. దాంతో మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 26 ఏళ్లలో ఈ హోటల్ మూతబడటం ఇదే తొలిసారి. ఇది ప్రపంచంలోనే ఏకైక సెవన్ స్టార్ కావడం విశేషం!
ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోనని చైనా చెప్పింది: ట్రంప్
ఇరాన్‌కు ఇకపై ఆయుధాలు ఇవ్వబోనని చైనా అంగీకరించినట్టు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లేఖకు రాసిన ప్రత్యుత్తరంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు. అంతేగాక అమెరికా హార్మూజ్ జలసంధిని తెరవనుండటంపై చైనా ఎంతో సంతోషం వెలిబుచ్చిందని కూడా చెప్పుకొచ్చారు! ‘‘త్వరలో నేను చైనా వెళ్తున్నా. ప్రెసిడెంట్ జిన్‌పింగ్ గాఢమైన ఆలింగనంతో నన్ను స్వాగతించనున్నారు’’అని ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఖండించారు. ఇరాన్‌కు చైనా ఎప్పుడూ ఆయుధాలివ్వలేదన్నారు.
ఇరాన్‌కు పాక్ బృందం
అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలకు పరిస్థితిని సానుకూలం చేసే ప్రయత్నాల్లో భాగంగా సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ సారథ్యంలోని పాక్ ప్రతినిధి బృందం బుధవారం టెహ్రాన్ చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తదితరులతో మంతనాలు జరిపింది. రెండో దఫా చర్చలకు ఇస్లామాబాద్‌లో ఇప్పటికే ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి.


