ఇకపై నేను మంచివాడిని కాదు | Donald Trump Issues Fresh Warning to Iran Over Nuclear Program | Sakshi
Sakshi News home page

ఇకపై నేను మంచివాడిని కాదు

Apr 30 2026 4:58 AM | Updated on Apr 30 2026 4:58 AM

Donald Trump Issues Fresh Warning to Iran Over Nuclear Program

అణు కార్యక్రమాలపై దౌత్యపరమైన పరిష్కారం లభించాలి  

లేకపోతే అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం  

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిక 

వాషింగ్టన్‌: ఇరాన్‌ అణు కార్యక్రమాలపై దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమైనంత త్వరగా లభించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తేల్చిచెప్పారు. ఒకవేళ ఆశించిన పరిష్కారం లభించకపోతే అత్యంత కఠినంగా వ్యవహరించక తప్పదని ఇరాన్‌ను హెచ్చరించారు. ముప్పు తప్పించుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలని ఇరాన్‌కు సూచించారు. అణ్వస్త్ర కార్యక్రమాలకు స్వస్తి పలకాలని పరోక్షంగా స్పష్టంచేశారు. ఈ మేరకు చేతుల్లో తుపాకీ పట్టుకున్న ఫొటోను ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో తాజాగా పోస్టుచేశారు. ఇందులో కొండలపై బాంబు పేలుళ్ల దృశ్యం కనిపిస్తోంది. 

తన మాట వినకపోతే ఇరాన్‌పై భీకర యుద్ధానికి సిద్ధమని ట్రంప్‌ సంకేతాలిచ్చారు. ఇకపై తాను మంచివాడిగా ఉండబోనని(నో మోర్‌ మిస్టర్‌ నైస్‌ గై) అని ట్రంప్‌ పోస్టు చేశారు. శాంతి చర్చల విషయంలో ఇరాన్‌ సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. అమెరికాతో అణ్వస్త్ర రహిత ఒప్పందం ఎలా చేసుకోవాలని ఇరాన్‌కు ఏమాత్రం తెలియడం లేదని ఆక్షేపించారు. వారు కాస్త తెలివిగా ప్రవర్తిసే బాగుంటుందని పేర్కొన్నారు. అమెరికా–ఇరాన్‌ మధ్య రెండో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా షరతులను ఇరాన్‌ అంగీకరించడం లేదు.   

అమెరికా యుద్ధ వ్యయం రూ.2.37 లక్షల కోట్లు
పశ్చిమాసియాలో ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ఇప్పటిదాకా 25 బిలియన్‌ డాలర్లు(రూ.2.37 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు పెంటగాన్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జూల్స్‌ హస్ట్‌–3 వెల్లడించారు. ఈ సమాచారాన్ని అమెరికా చట్టసభ సభ్యులకు చేరవేశారు. హౌస్‌ ఆరŠమ్డ్‌ సర్వీసెస్‌ కమిటీతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. 25 బిలియన్‌ డాలర్లలో ఎక్కువ భాగం ఆయుధ సామగ్రిపై ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సైనిక  కార్యకలాపాలు నిర్వహించడానికి, ఖాళీ అయిన పరికరాలను భర్తీ చేయడానికి కూడా పెద్ద ఎత్తున సొమ్ము వ్యయం చేసినట్లు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement