ఇరాన్‌ విషయంలో ఏం చేద్దాం?  | Donald Trump, Benjamin Netanyahu At Odds Over Iran War | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ విషయంలో ఏం చేద్దాం? 

May 22 2026 5:18 AM | Updated on May 22 2026 5:18 AM

Donald Trump, Benjamin Netanyahu At Odds Over Iran War

ఫోన్‌లో డొనాల్డ్‌ ట్రంప్, బెంజమిన్‌ నెతన్యాహు చర్చలు  

వాషింగ్టన్‌:  ఇరాన్‌పై యుద్ధం విషయంలో ఏం చేయాలో తెలియక అమెరికా, ఇజ్రాయెల్‌ తలపట్టుకుంటున్నాయి. యుద్ధాన్ని ముగించాలా? లేక కొనసాగించాలా? అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇరాన్‌ లొంగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహు మంగళవారం ఫోన్‌లో చాలాసేపు మాట్లాడుకున్నట్లు తెలిసింది. 

ఇరాన్‌ విషయంలో భవిష్యత్తు కార్యాచరణపై వారు విస్తృతంగా చర్చించుకున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికా మాత్రం ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోంది. దాడులు పునఃప్రారంభించే ఆలోచన లేదని సంకేతాలిస్తోంది. కానీ, మళ్లీ దాడులు చేయాల్సిందేనని నెతన్యాహు పట్టుబడుతున్నారు. 

ఇరాన్‌ సైనిక సామర్థ్యాలను మరింతగా దెబ్బతీయడానికి, కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేయడం ద్వారా ఆ దేశ పాలనా వ్యవస్థను దెబ్బకొట్టడానికి దాడులు పునఃప్రారంభించాలని అంటున్నారు. ఇరాన్‌పై తలపెట్టిన దాడులను ఖతార్, యూఏఈ సహా అరబ్‌ దేశాల అభ్యర్థన మేరకు వాయిదా చేసినట్లు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం పాకిస్తాన్, ఖతార్‌లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య అంతరాలను పూడ్చే ప్రయత్నంలో భాగంగా సవరించిన శాంతి ఒప్పంద పత్రాన్ని రూపొందించాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరవచ్చని భావిస్తున్నాననిజ.. కానీ, అలా జరగకపోతే యుద్ధాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్‌ పేర్కొంటున్నారు.  

అబ్బాస్‌ అరాగ్చితో పాకిస్తాన్‌ మంత్రి భేటీ  
టెహ్రాన్‌: పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్‌ నఖ్వీ గురువారం టెహ్రాన్‌లో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చితో సమావేశమయ్యారు. అమెరికా–ఇరాన్‌ శాంతి చర్చలపై వారిద్దరూ చర్చించుకున్నారు. తాజా పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement