యూదు వ్యతిరేక నిరసనలను అడ్డుకోలేదని ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికాలో ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోర్టులో దావా వేసింది. వర్సిటీ క్యాంపస్‌లో యూదు వ్యతిరేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను అణచివేయడంలో హార్వర్డ్ యాజమాన్యం విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. వర్సిటీ యాజమాన్యాన్ని కోర్టుకు లాగడం చర్చనీయాంశంగా మారింది. హార్వర్డ్‌కు ఇచ్చే నిధులను నిలిపివేయడం, ఇప్పటిదాకా ఇచి్చన సొమ్మును తిరిగి వసూలు చేసుకోవడం ట్రంప్ సర్కారు ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఈ మేరకు అమెరికా న్యాయ శాఖ శుక్రవారం మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టులో లాసూట్ దాఖలు చేసింది. విద్యాసంస్థల ప్రాంగణాల్లో జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించే ప్రసక్తే లేదని దావాలో తేల్చిచెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోకతప్పదని పేర్కొ ంది. పన్నుచెల్లింపుదారుల సొమ్మును హార్వర్డ్‌కు కట్టబెట్టామని పేర్కొంది. యూనివర్సిటీ నిర్వహణ కోసం బిలియన్ల డాలర్ల ధనం ఇచి్చనట్లు గుర్తుచేసింది. ఉద్రిక్తతలకు కారణమైన హార్వర్డ్ నుంచి ఆ సొమ్మును తిరిగి రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ శాఖ అభిప్రాయపడింది. అయితే, ఈ దావాపై హార్వర్డ్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.


