చంద్రుని ఆవలి వైపుకు చాంగే6 | China National Space Administration: China lands Change 6 sample-return probe on far side of the moon | Sakshi
Sakshi News home page

China National Space Administration: చంద్రుని ఆవలి వైపుకు చాంగే6

Jun 3 2024 5:09 AM | Updated on Jun 3 2024 6:49 AM

China National Space Administration: China lands Change 6 sample-return probe on far side of the moon

బీజింగ్‌: చంద్రుని ఆవలివైపు చైనా చాంగే6 ల్యాండర్‌ విజయవంతంగా దిగింది. అక్కడి మట్టిని సేకరించి తిరిగి భూమికి చేరుకోనుంది. చంద్రుని దక్షిణ ధృవ అయిట్‌కెన్‌(ఎస్‌పీఏ) బేసిన్‌ వద్ద బీజింగ్‌ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.23 గంటలకు విజయవంతంగా అది దిగిందని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మిని్రస్టేషన్‌(సీఎన్‌ఎస్‌ఏ) ప్రకటించింది.

 చాంగే6లో ఒక ఆర్బిటార్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్‌ ఉన్నాయి. మే మూడో తేదీన చాంగే6ను చైనా ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించారు. అది తొలుత భూస్థిర కక్ష్యలో, తర్వాత చంద్ర కక్ష్యలో తిరిగింది. చాంగే6లో ఆర్బిటార్‌–రిటర్నర్, ల్యాండర్‌–అసెండర్‌ జతలు ఉన్నాయి. ఆర్బిటార్‌–రిటర్నర్‌ జత నుంచి ల్యాండర్‌–అసెండర్‌ జత మే 30వ తేదీన విడిపోయింది. ఆర్బిటార్‌–రిటర్నర్‌ జత చంద్రుని కక్ష్యలోనే తిరుగుతోంది.  

కీలకమైన ల్యాండింగ్‌ 
ల్యాండర్‌–అసెండర్‌ జత చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్‌ అవడమే ఈ మొత్తం మిషన్‌లో అత్యంత కీలకమైన దశ. దిగేటపుడు మార్గమధ్యంలో ఏమైనా అవాంతరాలు ఉంటే వాటిని గుర్తించేందుకు స్వయంచాలిత అవాంతరాల నిరోధక వ్యవస్థ, కాంతి కెమెరాను వినియోగించారు. వీటి సాయంతో సురక్షితమైన ల్యాండింగ్‌ ప్రదేశాన్ని ఎంచుకుని ల్యాండర్‌–అసెండర్‌ అక్కడే దిగిందని చైనా అధికారి జిన్‌హువా వార్తాసంస్థ పేర్కొంది. ఎస్‌పీఏ బేసిన్‌లోని అపోలో బేసిన్‌లో ఇది దిగింది.

 భూమి వైపు కంటే ఆవలి వైపు చంద్రుడి ఉపరితలం కాస్తంత గట్టిగా ఉందని సీఏఎస్‌సీ అంతరిక్ష నిపుణుడు హుయాంగ్‌ హావో చెప్పారు. అక్కడ దిగిన ల్యాండర్‌ 14 గంటల్లోపు రెండు రకాలుగా మట్టిని సేకరిస్తుంది. డ్రిల్లింగ్‌ చేసి కొంత, రోబోటిక్‌ చేయితో మరికొంత ఇలా మొత్తంగా 2 కేజీల మట్టిని సేకరిస్తుంది. ల్యాండర్‌ చంద్రునికి ఆవలివైపు ఉపరితలంపై ఉన్న నేపథ్యంలో భూమి నుంచి నేరుగా దానిని కమాండ్‌ ఇవ్వడం అసాధ్యం. అందుకే కమ్యూనికేషన్‌కు వారధిగా ఇప్పటికే చైనా క్వికియానో–2 రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ శాటిలైట్‌ ద్వారా చాంగే–6 ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు.

మళ్లీ భూమి మీదకు 
సేకరించిన మట్టిని ల్యాండర్‌ అసెండర్‌లోకి చేరుస్తుంది. అసెండర్‌ రాకెట్‌లా నింగిలోకి దూసుకెళ్లి ఆర్బిటార్‌–రిటర్నర్‌ జతతో అనుసంధానమవుతుంది. రిటర్నర్‌ మాడ్యూల్‌లోకి మట్టిని మార్చాక రిటర్నర్‌ అక్కడి నుంచి భూమి దిశగా బయల్దేరుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జూన్‌ 25వ తేదీన రిటర్నర్‌ భూమి మీదకు చేరుకుంటుంది. చంద్రుని ఆవలివైపు మట్టిని తీసుకొచ్చిన దేశంగా చైనా చరిత్రలో నిలిచిపోనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement