డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షునిగా కాసేపు యుద్ధం అంటారు.. మరి కాసేపు శాంతి గెలిచింది అంటారు. అమెరికా పరిపాలన బాధ్యతలు రెండోసారి చేపట్టిన తర్వాత ప్రతీ అంశంలోనూ ఏదొక వివాదం లేకుండా ఆయనకు పూట ముందుకెళ్లడం లేదు. అమెరికాతో యుద్ధంలో భాగంగా చర్చలకు ఇరాన్ సిద్ధమవ్వగానే ప్రపంచ శాంతి గెలిచిందంటూ ఒక గంభీరమైన ప్రకటన ఇచ్చేశారు. ఇరాన్ చర్చలకు ఒప్పుకున్న మాట అత్యంత సంకట స్థితిలో ఉన్న ట్రంప్‌కు ఊపిరినిచ్చినట్లయ్యింది. అంతకుముందు వరకూ ఇరాన్‌ను అది చేస్తాం. ఇది చేస్తాం అన్న ట్రంప్ నోట శాంతి మాట వినిపించింది.
అయితే అది కేవలం శాంతి చర్చలకు మాత్రమే ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అంటే ఇక్కడ యుద్ధానికి బ్రేక్ మాత్రమే వచ్చింది.. పూర్తిగా యుద్ధాన్ని ముగించేందుకు కాదనే విషయం ఇరానే తెలపడం ద్వారా చర్చలు తర్వాతే అసలు విషయం ఏమిటన్నది తెలుస్తుందని చెప్పేసింది.
చర్చల్లో లెబనానే హాట్ టాపిక్..?
ఇజ్రాయెల్ బుధవారం 100 మిస్సైళ్లను ప్రయోగించడంతో లెబనాన్‌లో 250 వరకూ మరణించారు. ఇది ఇరాన్ అత్యంత అసహనం తెప్పించింది. ఒకవైపు పాకిస్తాన్ వేదికగా ఇరు దేశాలు చర్చలకు సిద్ధమైన తరుణంలో ఇజ్రాయెల్ మాత్రం ఇంకా లెబనాన్‌పై దాడులు చేస్తూనే ఉండటం ఏంటని ప్రశ్నించింది.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న సమయంలో ఆ దేశానికి సాయం చేసిన వారిలో హెజ్‌బుల్లా దళం ఒకటి. మరి వారిపై దాడులు చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా?, తమతో చర్చలు అంటూ తమకు మద్దతిచ్చిన వారిపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదు.
సీజ్‌ఫైర్ అనేది కేవలం అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య మాత్రమేనని అది లెబనాన్ విషయంలో కాదని అంటున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని కూడా ఇదే మాట అంటున్నారు.
ఒకవేళ లెబనాన్‌ను సీజ్‌ఫైర్ అంశంలో చేర్చకపోతే ఇరాన్ ఒప్పుకుంటుందా? అనేదే ఇప్పుడు ట్రంప్ ముందున్న ప్రశ్న. అలా జరగని పక్షంలో ట్రంప్ ముందున్నది ఏమిటి అనే చర్చ మొదలైంది. ఇరాన్ పెట్టే ఈ షరతకు ఒప్పుకోవాలంటే.. అందుకు ముందుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ట్రంప్ ఒప్పించాలి. మరి నెతన్యాహూ ఇందుకు ఒప్పుకుంటారా? అనేది మరో ప్రశ్న.
నెతన్యాహూపై ఒత్తిడి తేగలరా?
లెబనాన్‌పై యుద్ధాన్ని ఆపమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపై ట్రంప్ ఒత్తిడి తీసుకు రావాల్సి ఉంటుంది. లెబనాన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్.. ఆ దాడిని ఆపాలని చర్చలకు ముందే చెప్పింది. వాటిపై అమెరికా-ఇజ్రాయెల్ పెద్దలు నో అంటున్నారు. శాంతి చర్చల్లో కూడా అదే మాట అంటే మాత్రం.. అదే సమయంలో ‘‘లెబనాన్‌పై దాడులు ఆపకపోతే చర్చలు లేవు.. ఏమీ లేవు’’ అని ఇరాన్ అంటే మాత్రం ట్రంప్ నోట్లో వెలక్కాయపడినట్లే. ఆ సమయంలో ట్రంప్ ముందున్నది మళ్లీ యుద్ధానికి దిగడమే. అంటే ఇక్కడ పూర్తిగా శాంతియుత వాతావరణం రావాలని కోరుకుంటే మాత్రం నెతాన్యాహూను ముందుగా ఒప్పించాలి ట్రంప్.
పాక్‌కు జేడీ వాన్స్..!
ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే ఆంక్షలకు ఒప్పుకోదనే నేరుగా అమెరికా ఉపాధ్యక్షుడే.. రేపు(శుక్రవారం) పాకిస్తాన్‌కు వస్తున్నారు. పాకిస్తాన్ వేదికగా ఈ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి.. కచ్చితంగా అమెరికా పెద్ద తలకాయలు ఉండాల్సిందేనని ఇరాన్ పట్టుబట్టిన నేపథ్యంలో జేడీ వాన్స్‌ను పాకిస్తాన్ పర్యటన దాదాపు ఖరారైంది. తమతో చర్చల్లో భాగంగా అమెరికా పరిపాలన విభాగంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థాయి తప్పితే మరే అధికారులు తమకు అవరసం లేదని ఇరాన్ పంతం పట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నమ్మదగిన జేడీ వాన్స్ ను పాక్‌కు పంపించబోతున్నారనే టాక్ నడుస్తోంది.
మరి జేడీ వాన్స్.. ఇరాన్‌ను ఎంతవరకూ ఒప్పిస్తారనేది చూడాలి. లెబనాన్‌ను పక్కకు పెట్టి ఈ శాంతి చర్చలు సాగుతాయా?, ఇరాన్ పెట్టే పలు కండిషన్స్‌కు అమెరికా ఊ కొడుతుందా? అనేది చూడాలి.
కొసమెరుపు ఎలా ఉండబోతుంది..?
ఇరాన్‌తో కచ్చితంగా అమెరికా సుదీర్ఘ చర్చలే జరపనుంది. ఇప్పటివరకూ యుద్ధంలో అమెరికాకు ఇరాన్ అంతు చిక్కకపోవడం ఒకటైతే.. ఈ యుద్ధంలో అమెరికాలో ప్రజల నుంచి ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ తరుణంలో ఇరాన్‌తో చర్చల ద్వారానే వారిపై గెలవాలనే భావనలో ఉన్నారు ట్రంప్.
జేడీ వాన్స్ చర్చల తర్వాత ‘ ప్రపంచ శాంతి వెల్లివిరిసింది’ అంటూ ట్రంప్ మళ్లీ తనదైన శైలిలో ఓ ప్రకటన ఇవ్వనున్నారా?.. .. లేక ‘‘ఇరాన్‌కు చుక్కలు చూపించబోతున్నాం’’ అనే మాట ట్రంప్ నోట మళ్లీ వినబడుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.


