ఇమ్రాన్‌ ఖాన్‌ హత్యకు ఆసిమ్‌ మునీర్‌ కుట్ర | Bushra Bibi is being pushed to the edge to force me into submission said Imran Khan | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ ఖాన్‌ హత్యకు ఆసిమ్‌ మునీర్‌ కుట్ర

Apr 15 2026 7:24 PM | Updated on Apr 15 2026 8:11 PM

Bushra Bibi is being pushed to the edge to force me into submission said Imran Khan

ఇస్లామాబాద్‌: పీటీఐ వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న పరిస్థితులు, అలాగే ఆయన భార్య బుష్రా బీబీపై జరుగుతున్న ఒత్తిడి అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి బుష్రా బీబీని జైల్లో ఏకాంతంగా ఉంచి, మానసికంగా కుంగదీసే ప్రయత్నం జరుగుతోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, జైల్లోనే ఆయనను, ఆయన భార్య బుష్రా బీబీని చంపేందుకు ప్రస్తుత ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్‌పై అవినీతి కేసులు, అక్రమ ఆస్తుల వ్యవహారాలు, హింసాత్మక నిరసనలకు సంబంధించిన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసి, కొన్ని తీర్పులలో జైలు శిక్షలు విధించారు. అదే సమయంలో ఆయన భార్య బుష్రా బీబీ కూడా అవినీతి, అక్రమ ఆస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ప్రతిపక్షం ఆరోపణల ప్రకారం, ఈ అరెస్టులు రాజకీయంగా దెబ్బతీయడానికి, విపక్షాన్ని అణగదొక్కడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలుగా భావిస్తున్నారు.

రావల్పిండి అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరు నెలలుగా ఒంటరి నిర్బంధంలో ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని, కుడి కన్నులో దృష్టి దాదాపు కోల్పోయారని సమాచారం. తాజాగా ఆయన భార్య బుష్రా బీబీ కూడా అదే విధంగా ఒంటరిగా ఉంచుతున్నారని,వారానికి ఒకసారి 30 నిమిషాల పాటు మాత్రమే భర్తను కలిసే అవకాశం ఇస్తున్నారని, అది కూడా తరచుగా నిరాకరిస్తున్నారని ఆయన న్యాయవాది సల్మాన్ సఫ్దర్ తెలిపారు.

ఇమ్రాన్ సోదరి అలీమా ఖానుం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తూ, ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెయిల్ విచారణను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. కేసులు బలహీనమైనవని, ఒకసారి విచారణ జరిగితే ఆయనకు బెయిల్ తప్పదని, అందుకే విచారణనే జరగనివ్వడం లేదని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి సాధనంగా మారిందని, న్యాయం జరగకుండా అడ్డు కుంటుందని ఆమె తీవ్రంగా విమర్శించారు.

ఈ పరిణామాలు పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరతను మరింతగా పెంచుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీపై జరుగుతున్న ఒత్తిడి, అరెస్టులు, ఆరోగ్య సమస్యలు పాకిస్థాన్‌లో చర్చకు దారితీస్తున్నాయి.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement