
మంటల్లో చిక్కుకున్న భారీ సరకు రవాణా నౌక
లైఫ్‌బోట్ సాయంతో సురక్షితంగా బయటపడిన 22 మంది సిబ్బంది
యాంకరేజ్: ఏకంగా 3,000 కొత్త కార్లతో చైనా నుంచి మెక్సికోకు బయల్దేరిన భారీ సరుకు రవాణా నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు మరింతగా విస్తరిస్తుండటతో నౌకను సిబ్బంది నడిసంద్రంలో వదిలేయాల్సి వచ్చింది. లైఫ్‌బోట్ సాయంతో 22 మంది సిబ్బందిని రక్షించగలిగారు. లండన్ కేంద్రంగా పనిచేసే జోడియాక్ మేరిటైమ్ సంస్థ ఈ ‘ది మార్నింగ్ మిడాస్’నౌకను నిర్వహిస్తోంది.
పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాలోని అలాస్కా రాష్ట్ర పరిధిలోని అడాక్ దీవి సమీపంలో ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు సమీపంలో ప్రయాణిస్తున్న కోస్కో హెలాస్ సరకు రవాణానౌకలోని సిబ్బంది అప్రమత్తమై మిడాస్ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించారు. ఘటన జరిగినప్పుడు నౌకలో 800 కొత్త విద్యుత్ కార్లు సహా 3,000 కార్లు ఉన్నాయి.
అగ్నికీలలను ఎలా అదుపులోకి తేవాలనే దానిపై జోడియాక్ సంస్థతో సంప్రతింపులు జరుపుతున్నామని అమెరికా తీరగస్తీ 17వ జిల్లా కమాండర్ రియర్ అడ్మిరల్ మెగాన్ డీన్ చెప్పారు. చైనాలో తయారైన ఈకార్లతో మే 26వ తేదీన నౌక బయల్దేరింది. మెక్సికోలోని లజారో కార్డెనాస్ నౌకాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలో ఇలా అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. ఈ నౌకను 2006లో చైనాకు చెందిన నౌకాతయారీ సంస్థ తయారుచేసింది. ఈ నౌక బరువు ఏకంగా 46,800 టన్నులు.