వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ దీనిపై స్పందించారు. ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. “ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజు. ఇరాన్ కూడా శాంతినే కోరుకుంటోంది. ఇక యుద్ధాన్ని కొనసాగించాలనుకోవడం లేదు. అలాగే, అందరికీ కూడా ఇలాగే అనిపిస్తోంది.
హార్మూజ్ జలసంధిలో ట్రాఫిక్ పెరుగుదల విషయంలో అమెరికా సాయం చేస్తుంది. పాజిటివ్ చర్యలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదన జరుగుతుంది. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించవచ్చు. మేము అన్ని రకాల సరఫరాలతో లోడ్ అవుతాము. పరిస్థితి సజావుగా సాగేందుకు అక్కడే ఉండబోతున్నాం. అది జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అమెరికాలో మేము అనుభవిస్తున్నట్లే, ఇది పశ్చిమాసియాకు స్వర్ణ యుగం కావచ్చు” అని అన్నారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా విషయంలో అనుసరిస్తున్న విధానం, ఇరాన్‌పై సైనిక చర్యకు దిగాలని తీసుకున్న నిర్ణయం సరికాదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సలహాదారుగా పనిచేసిన బెన్ రోడ్స్ అన్నారు. ట్రంప్ నిర్ణయాలు అత్యుత్తమ పరిస్థితుల్లో కూడా విపత్తుకర పరిస్థితులకు దారితీశాయని చెప్పారు.
ఇరాన్‌పై యుద్ధం చేయాలన్న నిర్ణయంతో తర్వాత ఏం జరిగినా అమెరికా చరిత్రలో తీవ్రంగా సిగ్గుపడే ఘటనగా మిగిలిపోతుందని అన్నారు. ట్రంప్ చర్యల వల్ల ప్రపంచ వేదికపై అమెరికా హోదా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. అంతేగాక, ప్రపంచంలో ఆర్థిక ప్రతికూల ప్రభావాలు వస్తాయని ఆయన అంచనా వేశారు. అలాగే ట్రంప్ నిర్ణయాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మరింత శక్తిమంతుడిని, సంపన్నుడిని చేశాయని అన్నారు.


