మరణ వందతుల వేళ నౌరూజ్ శుభాకాంక్షలు..నెతన్యాహు సర్‌ప్రైజ్ | Benjamin netanyahu sent wishes to iranians for the nowruz holidays | Sakshi
Sakshi News home page

మరణ వందతుల వేళ నౌరూజ్ శుభాకాంక్షలు..నెతన్యాహు సర్‌ప్రైజ్

Mar 17 2026 7:13 AM | Updated on Mar 17 2026 7:33 AM

Benjamin netanyahu sent wishes to iranians for the nowruz holidays

జెరుసలేం: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నౌరూజ్‌ పండుగ సందర్భంగా ఇరాన్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరణించారన్న వదంతులు సోషల్‌ మీడియాలో హోరెత్తుతున్న సమయంలో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. ఇరాన్‌ ప్రజలు జరుపుకునే నౌరూజ్‌ పండుగను పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌ వేదిగా విడుదల చేసిన వీడియో సందేశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సోమవారం ఇరాన్‌ ప్రజలకు నౌరూజ్‌ శుభాకాంక్షలు తెలిపారు. పర్షియన్‌ నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈసారి కూడా వీడియో సందేశం విడుదల చేశారు. ‘ధైర్యవంతులైన ఇరాన్‌ ప్రజలకు నేను ప్రతి సంవత్సరం చెప్పినట్లుగా ఈసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లైట్ల పండుగతో ప్రారంభమయ్యే ఈ సెలవు దినాలు మీకు ఆనందాన్ని ఇవ్వాలి’ అని ఆయన పేర్కొన్నారు.

నెతన్యాహు ప్రత్యేకంగా చాహర్షన్‌బే సూరి అనే పురాతన ఇరానియన్‌ కాంతి, అగ్ని పండుగను ప్రస్తావించారు. ఈ పండుగలో వెలుగులు చీకటిపై, మంచి చెడుపై విజయం సాధిస్తాయనే విశ్వాసాన్ని ఇరాన్‌ ప్రజలు తరతరాలుగా కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ‘ఈ సంవత్సరం ఈ పండుగకు ప్రత్యేకత ఉంది. మీ అందరికీ స్వేచ్ఛతో కూడిన కొత్త సంవత్సరం కావాలని, ఆశతో నిండిన కొత్త ఆరంభం కావాలని కోరుకుంటున్నాను’ అని నెతన్యాహు ఆకాంక్షించారు.  

ఇరాన్‌ ప్రజలకు, ముఖ్యంగా ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ మతపరమైన నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారికి, నెతన్యాహు గత కొన్నేళ్లుగా తరచూ ఇలాంటి సందేశాలు పంపుతున్నారు. మార్చి 7న జరిగిన ఒక టెలివిజన్‌ సమావేశంలో కూడా ఆయన ‘నిజం చెప్పే సమయం దగ్గరపడుతోంది. మీరు నియంతృత్వపు బంధనాల నుండి బయటపడాలి. అప్పుడు ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మళ్లీ ధైర్యవంతమైన స్నేహితులుగా మారతాయి’ అని వ్యాఖ్యానించారు.

నెతన్యాహు మరణించారన్న వదంతులు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో ఈ వీడియో వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆయన ప్రత్యక్షంగా మాట్లాడిన ఈ సందేశం, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement