అనుకున్న సమయానికే ఉపసంహరణ

August 31 US withdraws Afghan forces - Sakshi

ఆగస్టు 31నాటికి అఫ్గాన్‌ నుంచి వైదొలుగుతాం

అమెరికా స్పష్టీకరణ

వాషింగ్టన్‌: ముందుగా అనుకున్నట్లే ఆగస్టు 31 నాటికి అఫ్గాన్‌ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా మరోమారు ప్రకటించింది. ఐసిస్‌–కే కారణంగా తరలింపు ప్రక్రియ ప్రమాదకరంగా మారినా, అనుకున్న సమయానికే పూర్తి చేయాలని యూఎస్‌ నిర్ణయించింది. ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, తమ దళాలు ప్రమాదంలో ఉన్నాయని, అయితే బలగాలు అఫ్గాన్‌లో ఉన్నంత కాలం ప్రమాదంలో ఉన్నట్లేనని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. తరలింపులో ఇది అత్యంత ప్రమాదకరమైన భాగమన్నాయి.

కాబూల్‌ విమానాశ్రయంపై ఐసిస్‌–కే ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే! ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు బైడెన్‌ చెప్పారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో తరలింపు వాయిదా వేయాలన్న ప్రతిపాదనేదీ రాలేదని, డెడ్‌లైన్‌ కల్లా ప్రక్రియ పూర్తి చేస్తామని మిలటరీ అధ్యక్షుడికి స్పష్టం చేసిందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకీ చెప్పారు. తరలింపు ప్రక్రియ ప్రస్తుతం తిరోగామి దిశలో (రెట్రోగ్రేడ్‌) ఉందన్నారు. అంటే రోజులు గడిచే కొద్దీ అఫ్గాన్‌లో ఉండే బలగాలు తగ్గుతూ వస్తుంటాయని, ఉన్న వారితోనే సురక్షితంగా అఫ్గాన్‌నుంచి బయటపడే ప్రక్రియ పూర్తి చేయాలని వివరించారు.   

తాలిబన్లను నమ్మలేం
తాలిబన్లపై తమకు నమ్మకం లేదని, కానీ ప్రస్తుతం వారితో పనిచేయడం మినహా వేరే మార్గం లేదని సాకీ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌లో చాలా భూ భాగం తాలిబన్ల అధీనంలో ఉందని, విమానాశ్ర యం కూడా వారి స్వాధీనంలోనే ఉందని, అందువల్ల వారి సహకారంతో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు సుమారు 1,09,200 మందిని అఫ్గాన్‌ విమానాశ్రయం నుంచి తరలించామని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. శుక్రవారం 12 గంటల వ్యవధిలో 4,200 మందిని 12 యుద్ధ విమానాల్లో దేశం దాటించామని తెలిపాయి. జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం 1,14,800 మందిని అఫ్గాన్‌ సరిహద్దులు దాటించామని వెల్లడించాయి. అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా వీసాలున్న అర్హులైన అఫ్గాన్‌ పౌరులను దేశం దాటించే వరకు రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలని అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశించినట్లు సాకీ తెలిపారు.  

పౌరుల తరలింపు పూర్తి
శనివారానికి అఫ్గాన్‌లోని తమ పౌరులను తరలించే ప్రక్రియ పూర్తి అవుతుందని బ్రిటన్‌ ప్రకటించింది. దీంతో కేవలం కొన్ని మిలటరీ దళాలు మాత్రమే అఫ్గాన్‌లో ఉంటాయని, అవి కూడా ఆగస్టు 31కి స్వదేశానికి చేరతాయని బ్రిటన్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ నిక్‌కార్టర్‌ చెప్పారు. ఎంత ప్రయత్నించినా అందరినీ దేశం దాటించడం కుదరదని, నిజానికి ఇలాంటి ముగింపును తాము ఊహించలేదని తెలిపారు.  ఆగస్టు 13 నుంచి దాదాపు 14,543 మందిని బ్రిటన్‌ కాబూల్‌ నుంచి తరలించింది. ఇంకా 100–150 మంది బ్రిటిష్‌ పౌరులు అఫ్గాన్‌లోనే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top