ఈజిప్ట్‌తో బంధం బలోపేతం

74th Republic Day: PM Narendra Modi holds talks with Egyptian President Abdel Fattah El-Sisi - Sakshi

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

అధ్యక్షుడు సిసితో మోదీ భేటీ

ఐదు ఒప్పందాలపై సంతకాలు

పలు రంగాల్లో మరింత సహకారం

ఐదేళ్లలో 1,200 కోట్ల డాలర్లకు ద్వైపాక్షిక వాణిజ్యం

న్యూఢిల్లీ: ఈజిప్టుతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్‌ నిర్ణయించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌ సిసి (68)తో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వర్తకం రంగాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

700 కోట్ల డాలర్లున్న ద్వైపాక్షిక వర్తకాన్ని ఐదేళ్లలో 1,200 కోట్ల డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. ఆహార, ఇంధన, ఎరువులు తదితర రంగాలపై రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావం తదితరాలు చర్చకు వచ్చాయి. ఐటీ, సైబర్‌ సెక్యూరిటీ, యువత, సమాచార, సాంస్కృతిక రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ‘‘ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక బంధం స్థాయికి పెంపొందించుకోవాలని భేటీలో నిర్ణయించాం.

ఇరు దేశాల వ్యూహాత్మక సహకారం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో శాంతికి, ప్రగతికి బాటలు పరుస్తుంది’’ అని మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచమంతటా ఉగ్రవాదం పెచ్చరిల్లుతుండటంపై ఇరు దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. ఇది మానవాళి భద్రతకు అతి పెద్ద సమస్యగా మారిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయి. ఉగ్రవాద భావజాల వ్యాప్తికి సైబర్‌ స్పేస్‌ దుర్వినియోగం చేస్తున్న తీరుకు అడ్డుకట్ట వేసేందుకు చేతులు కలపాలని నిర్ణయించాం’’ అన్నారు. కరోనా, యుద్ధంతో దెబ్బ తిన్న ఆహార, ఫార్మా సరఫరాలను బలోపేతం చేయడంపై చర్చించామన్నారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వట్రా తెలిపారు.

ఇదే తొలిసారి
గణతంత్ర ఉత్సవాలకు ఈజిప్టు అధ్యక్షున్ని ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఈజిప్టు సైనిక బృందం కూడా గణతంత్ర పరేడ్‌లో పాల్గొంటోంది. మూడో ఇండియా–ఆఫ్రికా ఫోరం శిఖరాగ్రంలో పాల్గొనేందుకు సిసి 2015లో తొలిసారి భారత్‌లో పర్యటించారు. తర్వాత ఏడాదికే మరోసారి పర్యటించారు.  

యువతే అతిపెద్ద లబ్ధిదారులు
అభివృద్ధి చెందిన భారతదేశంలో యువతే అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నారని ప్రధానినరేంద్ర మోదీ చెప్పారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే అతిపెద్ద బాధ్యత సైతం వారిపైనే ఉందన్నారు. గణతంత్ర పరేడ్‌లో పాల్గొననున్న ఎన్‌సీసీ కేడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘అమృతకాలంలో దేశ ఆకాంక్షలు, కలలకు యువత ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నేటితరానికి ఎన్నెన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశం సాధిస్తున్న ఘనతల్లోనే ప్రపంచం తన భవిష్యత్తును వెతుక్కుంటోంది. జాతి లక్ష్యాలు, ఆకాంక్షలతో యువతను ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ అనుసంధానిస్తున్నాయి. యువత మాట్లాడడం ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. భారత్‌ సారథ్యం వహిస్తున్న జి–20 కూటమి గురించి పాఠశాలలు, కళాశాలల్లో చర్చించుకోవాలి’’ అని సూచించారు. స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని యువతను కోరారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top