పారిపోయి.. అంతలోనే పట్టుబడి.. | - | Sakshi
Sakshi News home page

పారిపోయి.. అంతలోనే పట్టుబడి..

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

పారిపోయి.. అంతలోనే పట్టుబడి..

ఎస్కార్ట్‌ వాహనం నుంచి దూకి రిమాండ్‌ ఖైదీ పరారీ

పెట్రోలింగ్‌ పోలీసుల సాయంతో నిందితుడి పట్టివేత

కోర్టు విచారణ తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలిస్తుండగా ఘటన

సైదాబాద్‌: సినీఫక్కీలో ఎస్కార్ట్‌ వాహనం నుంచి కిందికి దూకి పారిపోయిన ఓ రిమాండ్‌ ఖైదీ కొద్దిసేపటికే పెట్రోలింగ్‌ సిబ్బంది చేతికి చిక్కాడు. వివరాలు... బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఒక దొంగతనం కేసులో నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలానికి చెందిన ఏ–1 సాదుల నరేష్‌(24), ఏ–2 భూక్యా వంశీ (23), ఏ–3 మల్లెం వంశీ(23)లు ఇటీవల అరెస్ట్‌ అయ్యారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నవారిని సోమవారం పోలీసులు పీటీ వారెంట్‌పై పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం కోర్టుకు తరలించారు. విచారణ ముగిసిన తర్వాత ఎస్కార్ట్‌ పోలీసులు వారిని తిరిగి వాహనంలో జైలుకు తరలిస్తుండగా సైదాబాద్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోకి రాగానే నరేష్‌, మల్లెం వంశీ ఒక్కసారిగా ఎస్కార్ట్‌ పోలీసులను తోసేశారు. డోర్‌ తీసుకొని పారిపోయేందుకు యత్నించిన వంశీని అడ్డుకోగా, నరేష్‌ కిందికి దూకి పరారయ్యాడు. వెంటనే ఎస్కార్ట్‌ పోలీసులు డబీర్‌పురా పోలీసులను అప్రమత్తం చేశారు. కొద్దిసేపటికే నల్లగొండ చౌరస్తా సమీపంలో తమను చూసి దాచుకోవటానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని డబీర్‌పురా పెట్రోలింగ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎస్కార్ట్‌ వాహనం నుంచి పరారైన రిమాండ్‌ ఖైదీ నరేష్‌ అని నిర్ధారించుకున్నారు. ఈ ఘటనపై సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేజారిన ఖైదీ మళ్లీ చిక్కడంతో ఎస్కార్ట్‌ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఖైదీల చేతులకు బేడీలు లేకపోవడమే వారు పారిపోయేందుకు అవకాశం ఏర్పడిందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement