
హైడ్రాలో ప్రజాపాలన దినోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: సామాన్య ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు గుర్తిస్తూ వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. బుద్ధ భవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన రంగనాథ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ‘1948 సెప్టెంబరు 17న భారత ప్రభుత్వంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సందర్భం నాటి పోరాట పటిమకు నిదర్శనం. దాన్ని ప్రజాపాలనకు హారతి పట్టిన రోజుగా అభివర్ణించవచ్చు. అందుకే ప్రభుత్వం ప్రతి ఏటా ఆ రోజున ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది. ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి. హైడ్రాలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలి. వారి సమస్యల పరిష్కా రానికి పెద్దపీట వేయాలి. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే’ అని రంగనాథ్ అన్నారు.