‘మణి’కొండ చుట్టే‘అవినీతి అనకొండలు’! | - | Sakshi
Sakshi News home page

‘మణి’కొండ చుట్టే‘అవినీతి అనకొండలు’!

Sep 18 2025 10:36 AM | Updated on Sep 18 2025 10:36 AM

‘మణి’కొండ చుట్టే‘అవినీతి అనకొండలు’!

‘మణి’కొండ చుట్టే‘అవినీతి అనకొండలు’!

విద్యుత్‌, మున్సిపల్‌, ఇరిగేషన్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌ విభాగాల్లో పాగా

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలోని ‘మణి’కొండ చుట్టే ‘అవినీతి అనకొండలు’ పాగా వేశాయి. ఇప్పటి వరకు ఎవరికీ కన్పించకుండా పుట్టలో దాగి ఉన్న ఈ అనకొండలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చి ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ కోసం రూ.నాలుగు లక్షలు తీసుకుంటూ వారం రోజుల క్రితం నార్సింగి మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీపీఓ మణిహారిక ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన అంశాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోకముందే..మంగళవారం దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఇబ్రహీంబాగ్‌ ఆపరేషన్స్‌ ఏడీఈ అంబేద్కర్‌ను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అరెస్ట్‌ చేసింది. తాజాగా బుధవారం ఆయన సన్నిహితుడిగా పేరొందిన చేవెళ్ల ఏడీఈ రాజేష్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించింది. బాత్‌రూంలో రూ.20 లక్షల నగదు సహా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

తప్పించినా..తప్పుకోకుండా...

ఏడీఈ అంబేద్కర్‌ 1998లో ఏపీఎస్‌ఈబీ ద్వారా ఖమ్మంలో తొలి పోస్టింగ్‌ సంపాదించారు. ఆ తర్వాత డిప్యూటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి ఏఈగా వచ్చారు. ఏడీఈగా పదోన్నతి పొందిన తర్వాత డిస్కంలోకి అడుగుపెట్టారు. పటాన్‌చెరు, కేబీహెచ్‌పీ, గచ్చిబౌలిలో కీలక పోస్టుల్లో పని చేశారు. ఆయన సర్వీసు అంతా ఫోకల్‌ పోస్టుల్లోనే కొనసాగారు. అయితే ఇబ్రహీంబాగ్‌, మణికొండ, గచ్చిబౌలి డివిజన్లపై గత ఏడాది డిస్కం ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహా అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడటంతో ఈ అంశాన్ని సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ సీరియస్‌గా తీసుకున్నారు. అప్పట్లోనే గచ్చిబౌలి డీఈని బదిలీ చేశారు. ఇబ్రహీంబాగ్‌ డీఈకి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో ఏడీఈ అంబేద్కర్‌ను సైతం మరో చోటికి బదిలీ చేశారు. ఆయినా..వెళ్లకుండా ప్రభుత్వంలోని పెద్దలకు భారీగా ముడుపులు ముట్టజెప్పి మళ్లీ ఆయన అదే పోస్టులో కొనసాగుతూ వచ్చారు. సాధారణంగా మూడేళ్లు ఫోకల్‌ పోస్టులో పని చేస్తే..ఆ తర్వాత ఆ పోస్టులో ఉంచరు. కానీ ఏడీఈ అంబేద్కర్‌ విషయంలో ఇవేవీ అమలు కాలేదు. ఏడీఈగా ప్రభుత్వ సంస్థ నుంచి ప్రతి నెలా రూ.లక్షల్లో వేతనాలు పొందుతూ..తన బినామీలతో యూజీ కేబుల్‌ వర్క్‌ చేయించి పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన ఇళ్లు సహా బంధువులు, సన్నిహితుల ఇళ్లు, ఆఫీసుల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది.

చేవెళ్ల ఏడీఈ ఇంట్లోనూ సోదాలు?

ఇబ్రహీంబాగ్‌ డివిజన్‌ చిలుకూరు సెక్షన్‌ ఏఈగా పని చేసి, ఇటీవలే పదోన్నతిపై చేవెళ్ల వెళ్లిన ఏడీఈ రాజేష్‌... అంబేద్కర్‌కు సన్నిహితుడని సమాచారం. మారేడుపల్లిలో నివాసం ఉంటున్న రాజేష్‌ ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. బాత్‌రూమ్‌లో రూ.17 లక్షల నగదు సహా కీలక స్థిరాస్తి డాక్యుమెంట్లు లభించినట్లు తెలిసింది. అయితే ఏసీబీ అధికారులు ఈ అంశాన్ని ఇంకా ధృవీకరించలేదు.

ఏసీబీ వలకు వరుసగా చిక్కుతున్న అవినీతి తిమింగలాలు..

నార్సింగి టీపీఓ అంశాన్ని మర్చిపోక ముందే తాజాగా మరొకరు

సంచలనం సృష్టించినఏడీఈ అంబేద్కర్‌ ఉదంతం

చేవెళ్ల ఏడీఈ ఇంట్లోనూ తాజాగా సోదాలు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement