
సీఎం రేవంత్‌రెడ్డికి రూ.2 కోట్ల చెక్కు అందజేస్తున్నఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు
మిర్యాలగూడ ఎమ్మెల్యే రూ.2 కోట్ల విరాళం
కొడుకు పెళ్లి రిసెప్షన్ మొత్తంతో రైతు సంక్షేమం
మిర్యాలగూడ: తన నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రూ.2 కోట్ల విరాళాన్ని గురు వారం సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. ఇటీవల తన కుమారుడు వివాహం జరగగా.. రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న రూ.2 కోట్లను రైతుల సంక్షేమం కోసం అందజేశారు. నియోజకవర్గంలో లక్ష మంది రైతులకు ఒక బస్తా యూరియాను ఉచితంగా అందించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కుమారుడు, కోడలు సాయిప్రసన్న, వెన్నెల వివాహం గత నెలలో జరిగింది.
రిసెప్షన్ ఈ నెల 12న ఘనంగా చేయాలని భావించారు. అయితే తమకు వేడుక వద్దని.. ఆ డబ్బును రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని కొడుకు, కోడలు కోరారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కు అందజేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆయన సతీమణి మాధవి, పెద్ద కుమారుడు, కోడలుతో పాటు చిన్న కుమారుడు సాయిఈశ్వర్‌రెడ్డి తదితరులు నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లి చెక్కు అందజేశారు.