breaking news
MIRYALAGUDA mla
-
డామిట్, మాట జారిపోయింది.! తప్పయిపోయింది సారీ! ఆ ఎమ్మెల్యే పరేషాన్
ఎప్పుడూ మంత్రి కాలేదు. కాని మంత్రి కంటే ఎక్కువగానే అధికారాలు అనుభవించారు. ప్రత్యేక రాష్ట్రం రాగానే రాజకీయ గురువుకు సున్నం పెట్టాడు. గెలిపించిన పార్టీకి పంగనామాలు పెట్టి అధికార పార్టీలో చేరిపోయాడు. మూడోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్న ఆ నేత ఇటీవల పదే పదే జనానికి సారీ చెబుతున్నాడు. అనవసరపు చిక్కులు కొని తెచ్చుకుంటున్నాడు. సీనియర్ ఎమ్మెల్యేకు సారీ చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇంతకీ ఆ నేత ఎవరు? కాంగ్రెస్‌కు చేయిచ్చి.. ఆ వెంటనే కారెక్కి.! ఎంతటి నాయకులైనా నోరు జారితే తిరిగి వెనక్కు తీసుకోలేరు. ఒక ఎమ్మెల్యే స్థాయి నేత పబ్లిక్‌లో ఇష్టారీతిన కామెంట్స్ చేస్తే అటు ఆయనకు.. ఇటు పార్టీకి కూడా నష్టం తప్పదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుకు ఇప్పుడదే జరిగింది. గతంలో రెండు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి షాడోగా వ్యవహరించిన వ్యక్తి. ఆయన అండదండలతో.. 2014లో రాజకీయాల్లోకి వచ్చీరాగానే.. మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్ పొందారు. ఎమ్మెల్యే కాగానే గురువును వదిలేసి గులాబీ పార్టీలో చేరిపోయారు భాస్కరరావు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకుని మరోసారి పోటీ చేసి గెలిచారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఎమ్మెల్యే భాస్కరరావు చేస్తున్న వ్యాఖ్యలు ఆయనతో పాటు గులాబీ పార్టీని కూడా ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోడ్లతో రాజకీయమా? ఆ మధ్య అడవిదేవులపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో..సీసీ రోడ్ల ప్రారంభోత్సం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు రాజకీయంగా దుమారం రేపాయి. మేము వేయించిన రోడ్లపై నడవద్దు, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకోవద్దని.. తాను తలుచుకుంటే ఐదు నిమిషాల్లో డ్యాన్సులు చేయిస్తానంటూ ప్రతిపక్షాలే లక్ష్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఆయనకు..పార్టీకీ డ్యామేజ్ చేసేవిగా మారాయి. జరిగిన నష్టం గమనించిన ఆయన తన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఘటన మరిచిపోకముందే మరో కార్యక్రమంలోనూ ఇదేరకంగా నోటి దురుసును ప్రదర్శించారాయన. మిర్యాలగూడలో జరిగిన దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమం సందర్బంగా ఎంపీపీ సరళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెండు కులాల పేర్లను ప్రస్తావిస్తూ... ఆ వర్గాలు చేసే పనులు కూడా నేనే చేయాలా అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. ఈ వీడియోలు బయటకు రావడం, వైరల్ కావడంతో మరోసారి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు నోటి దురుసు గురించి చర్చ మొదలైంది. బీసీ సంఘాలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొందరైతే ఎమ్మెల్యేకు ఫోన్లు చేసి నిరసన వ్యక్తం చేశారట. రెండు రోజులపాటు ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో.. ఎవరికి క్షమాపణలు చెప్పాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆయనలో కన్పించిందని అనుచరులే చెప్పారు. సారీ.. ఆ ఒక్కటి పట్టించుకోవద్దు దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన భాస్కరరావు క్షమాపణలు చెప్తూ వీడియో విడుదల చేశారు. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యే.. కొంతకాలంగా పదే పదే నోరు జారడానికి ఆయనలో పెరుగుతున్న టెన్షన్ కారణం కావచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా? రాదా? అన్న అనుమానం ఒకటైతే.. సీపీఎంతో పొత్తు కుదిరితే మిర్యాలగూడ కేటాయించాల్సి వస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందోనని భాస్కరరావు ఆందోళన చెందుతున్నారట. దీంతో పాటు ఈసారి తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని కూడా ఆయన అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో సీటు సీపీఎంకు కేటాయిస్తే.. ఇటు తన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు కొడుకు రాజకీయ అరంగేట్రం కూడా ఆలస్యం అవుతుందన్న ఆందోళనే ఆయన నోరు జారుడుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. పైగా తరచుగా వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం నేతలు సంబరాలు చేసుకుంటున్నారట. ఓ నేత అయితే ఏకంగా తన అనుచరులకు పార్టీ ఇచ్చారని మిర్యాలగూడలో ప్రచారం సాగింది. ఒకనాడు జానారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పిన నల్లమోతు భాస్కరరావు ఇప్పుడు ప్రతీ దానికి.. ఫోన్ చేసిన ప్రతీ వ్యక్తికి క్షమాపణలు చెప్పాల్సి రావడం అంటే.. ఆయన స్వయంకృతాపరాధమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే నోటి దురుసుతనానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
ఎమ్మెల్యే బంధువు అనుమానాస్పద మృతి
మిర్యాలగూడ :నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు బంధువు ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాలివీ..ఎమ్మెల్యే భాస్కర్‌రావు బంధువు పొట్రు సుధీర్(38) హైదరాబాద్‌లో సాప్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి మిర్యాలగూడ బైపాస్ రోడ్డులోని అగ్రిగోల్డ్ వెంచర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం సుధీర్ ను ఢీకొంది. తీవ్ర గాయాలతో విగతజీవిగా పడి ఉండగా శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సుధీర్ మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అందరి సహకారంతో అభివృద్ధి చేస్తా
ఎన్నికలకు ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాలకు కృష్ణా మంచినీటిని అందించడానికి కృషి చేస్తా. ప్రణాళికాబద్ధంగా అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పడు సమీక్ష సమావేశాలు నిర్వహించి అభివృద్ధికి కృషి చేస్తా. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ వారితో సఖ్యతతో ఉండి మిర్యాగూడ నియోజకవర్గానికి అధిక నిధులు వచ్చేలా కృషి చేస్తా. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో అతిపెద్ద పట్టణంగా ఉన్న మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా. ఇందుకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలో ఎంతో కాలంగా ఉన్న కేఎన్ఎం డిగ్రీ కళాశాల సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తా. కళాశాలలో అవసరం మేరకు ఉద్యోగులను ప్రభుత్వ పరం చేయడానికి ప్రయత్నిస్తా. అవసరమైతే అసెంబ్లీలో కేఎన్ఎం కళాశాల గురించి మాట్లాడుతా. పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మిర్యాలగూడ పట్టణంలోని అన్ని వార్డులతో పాటు అన్ని కాలనీలు పర్యటించి వాస్తవంగా ఎక్కడ మంచినీటి సమస్య ఉందో తెలుసుకుంటా. పట్టణ ప్రజానీకానికి రాబోయే 20 సంవత్సరాలకు సరిపడా మంచినీటి పథకాన్ని రూపొందించి మంజూరు చేయిస్తా. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యలేకుండా పరిష్కరిస్తా. అదే విధంగా పట్టణంలో అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పూర్తి చేయిస్తా. పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాలతో పాటు బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయిస్తా. పట్టణంలోని సాగర్ రోడ్డులో ఆరులేన్ల రోడ్డుగా విస్తరణ చేపడతా. రాజీవ్‌చౌక్ నుంచి సాగర్ రోడ్డులోని రైల్వే ట్రాక్ వరకు ఆరులేన్ల రోడ్డువిస్తరణ చేయిస్తా. సాగునీటికి ప్రాధాన్యం నియోజకవర్గంలో సాగునీటికి అధిక ప్రాధాన్యమిచ్చి రైతులకు మేలు చేయడానికి కృషి చేస్తా. దామరచర్ల మండలంలో కృష్ణానదిపై రెండు చోట్ల ఎత్తిపోతల పథకాలను కొత్తగా నిర్మించడానికి నిధులు మంజూరు చేయిస్తా. వజీరాబాద్, ముదిమాణిక్యం మేజర్ల లైనింగ్ పూర్తి స్థాయిలో చేయిస్తా. అదే విధంగా వేములపల్లి మండలంలోని ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయిస్తా. అదే విధంగా మూసీ కాలువలు ఆధునికీకరించి చివరి భూములకు సాగు నీరందే విధంగా ప్రయత్నం చేస్తా. భీమారం - సూర్యాపేట రోడ్డు అభివృద్ధికి పాటుపడతా మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న భీమారం - సూర్యాపేట రోడ్డు అభివృద్ధికి కృషి చేస్తా. ఆ రోడ్డును డబుల్ రోడ్డుగా చేస్తూ రూ. 25 కోట్లతో నిర్మిస్తా. అదే విధంగా వేములపల్లి మండలంలోని కామేపల్లి వద్ద ఉన్న కాజ్వే నిర్మిస్తా. ఇంకా నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా. లోఓల్టేజీ సమస్యను పరిష్కరిస్తా ముఖ్యంగా వేములపల్లి మండలంలో లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఆ సమస్యను అధిగమించడానికి అవసరమైన చోట సబ్స్టేషన్లు నిర్మించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో కూడా లోఓల్టేజీ సమస్యను పరిష్కరించడానికి విద్యుత్ అధికారులతో చర్చించి నిధులు విడుదల చేయిస్తా. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలి.