
ఎవరిది పాపం.. ఎవరికి శాపం ?
ఎన్నేళ్లయినా తప్పని నాలా చావులు
సాక్షి, సిటీబ్యూరో
ముషీరాబాద్ పార్సీగుట్ట ప్రాంతంలో దినేశ్, మల్లేపల్లి అఫ్జల్ సాగర్ ప్రాంతంలో అర్జున్, రామ అనే ముగ్గురు యువకులు నాలాల్లో గల్లంతై నాలుగు రోజులైనా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ మొక్కుబడి ప్రకటనలు తప్ప అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు వివిధ ప్రభుత్వ విభాగాలు అందుకు కారణం తాము కాదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. నాలాల వెంబడి ఉండే పేదలు, అమాయకుల ప్రాణాలు నాలాల్లో కలిసిపోతున్నాయి. కనీసం కడసారి చూసుకుందామనుకున్నా.. మృతదేహాలు జాడ కనిపించడం లేదు.
దాదాపు 15 వేల ఆక్రమణలు..
నగరంలో నాలాల సమస్యలు ఈనాటివి కావు. వరద ముప్పునకూ అవే కారణం కావడంతో 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాల నుంచీ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు మారడం.. రూ.కోట్లు ఖర్చయ్యాయి తప్ప పాతికేళ్లయినా ప్రజల ప్రాణాలు పోవడం ఆగలేదు. అసలు నాలా సమస్య పరిష్కారానికి కిర్లోస్కర్, వాయెంట్స్ సొల్యూషన్స్ నివేదికలే కీలకమైనా.. నేతలు తమ ఓట్ల కోసం వాటికి డీవియేషన్లు చేశారు. దాంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లేకుండా పోయింది. డ్రోన్లతో సహ వివిధ సర్వేలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాదాపు 15వేల ఆక్రమణలు తొలగించనిదే సమస్య పరిష్కారం కాదు. నిధులు సైతం రూ.20వేల కోట్లు అవసరం. కానీ.. ఆక్రమణలు తొలగిస్తే ఓట్లు రాలవనే తలంపుతో ఏ ప్రభుత్వంలోని వారైనా ప్రత్యామ్నాయంగా పనులు దారి మళ్లించడమో, నాలాలను విస్తరించే బదులు లోతు పెంచడమో వంటి ఆలోచనలే చేశారు. ఇందుకు ఏపార్టీ మినహాయింపు కాదు. అధికార యంత్రాంగం సైతం ఎప్పుడో సంభవించే ప్రమాదాల కోసం అంత భారీ పనులు నెత్తికెత్తుకోలేమనే ఆలోచనలే చేశాయి. దాంతో సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లేకుండాపోయింది.
రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా..
దాదాపు రూ. 15వేల కోట్లు ఖర్చయ్యే పరిష్కారాల బదులు ఖర్చు తగ్గే ప్రణాళికలు వేశారు. ప్రత్యేకంగా ఎస్‌ఎన్‌డీపీ(వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం) పేరిట దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేశారు. కానీ, కనీస భద్రత చర్యలు మాత్రం గాలికొదిలారు.
అశ్రద్ధ.. నిర్లక్ష్యం
ఇటీవలే బంజారాహిల్స్‌లో నాలా కప్పు కూలి లారీ దిగబడింది. అదృష్టవశాత్తూ అప్పుడు ప్రాణాపాయం తప్పింది. ఆ ఘటనతోనైనా అప్రమత్తమయ్యారా? అంటే కాలేదనే చెప్పాలి. నాలాలకు ఎక్కడ కప్పులు సరిగా లేవో, ఎక్కడ రిటైనింగ్ వాల్స్ దెబ్బతిన్నాయో తనిఖీలు చేసి తగిన మరమ్మతులు చేయడం.. కనీసం సదరు ప్రాంతాల్లో మెష్‌లు, హెచ్చరికల బోర్డుల వంటివి ఏర్పాటు చేసినా ప్రమాదకర నాలా ఉన్నట్లు తెలుస్తుంది. కనీసం ఆ పనులు కూడా చేయలేదు.
గొప్పయితే తాము.. తప్పయితే కాదు
ఇటీవల నాలాలకు సంబంధించిన బాధ్యతలు కూడా హైడ్రాకు అప్పగించడంతో జీహెచ్‌ఎంసీ నాలాలపై దృష్టి సారించడంలేదు. నాలాల్లో పూడికతీత పేరిట ఏటా రూ.50 కోట్లకు పైగా ఖర్చవుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.
చెత్త పనులూ కారణమే..
నగరంలోని నాలాల్లో నానాల రకాల చెత్త కుమ్మరిస్తున్న ప్రజలు కూడా సమస్యలకు కారకులే. ఆహార వ్యర్థాల నుంచి మొదలు పెడితే పరుపుల దాకా నాలాల్లో కుమ్మరిస్తుండటంతో వర్షాలొచ్చినప్పుడు పొంగిపొర్లుతున్నాయి.
అవగాహన లేమి
చాలామంది అధికారులకే నగరంలోని నాలాల గురించి సరైన అవగాహన లేదు. ఏ నాలా ఎక్కడ మొదలై, ఎక్కడ ముగుస్తుందో తెలియదు. నాలాలకు సంబంధించిన ఇన్వెంటరీ కూడా లేకపోవడం శోచనీయం.
ఆక్రమణలు ప్రధాన కారణం
ఇక నాలాల ఆక్రమణలకు అంతే లేదు. నాలాలను ఆక్రమించి పలు బహుళ అంతస్తుల భవనాలు నగరంలో కోకొల్లలు. నాలా అంచుల వెంబడే ఉన్న భవనాలకూ లెక్కేలేదు.
ప్రజలు సైతం..
నాలాల ప్రాంతాల్లో ఉండే ప్రజలు సైతం ఆస్తుల సేకరణకు అంగీకరించడం లేదు. ఎంతోకాలంగా ఉంటున్న సొంత స్థలాన్ని వదులుకోవడానికి వారు ససేమిరా అంటున్నారు. ప్రమాదాలు జరిగినా తమకే కదా .. అంటున్న వారూ ఉన్నారు.
వేలాది కిలోమీటర్లు
నగరంలో అక్కడా ఇక్కడా అని కాదు. అన్ని ప్రాంతాల్లో దాదాపు 5వేల కిలోమీటర్ల మేర నాలాలున్నాయి.
అధికారుల లెక్కల మేరకు..
నాలాల పొడవు: 1302 కిలోమీటర్లు
మేజర్ నాలాల పొడవు : 393 కిలోమీటర్లు
బఫర్‌జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు: 28,000
కప్పుల్లేవ్.. రక్షణ చర్యల్లేవ్
రెండు మీటర్లలోపు వెడల్పు ఉండే నాలాలన్నింటికీ పైకప్పులుండాలి. కానీ, చాలా ప్రాంతాల్లో లేవు. నేరేడ్‌మెట్ నాలాలో పడి బాలిక మరణించినప్పుడు అన్నింటిికీ పైకప్పులు వేస్తామని ప్రకటించినా, ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదు. ముషీరాబాద్ నాలాకు కూడా పైకప్పు లేదు. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుండే నాలాల్లో ప్రజలు పడిపోకుండా, వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వాటిని విస్మరించారు.
ఏదీ నాలా సేఫ్టీ ?
గతంలో ప్రతియేటా వర్షాకాలానికి ముందే తమ పరిధిలోని నాలాలన్నింటినీ ఇంజినీర్లు స్వయంగా కాలినడకన తిరిగి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రతచర్యలు తీసుకునేలా చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాంతో, పూర్తిస్థాయిలో కాకపోయినా ప్రమాదాల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం నాలా సేఫ్టీ అనేది పూర్తిగా విస్మరించారు.
దారుస్సలాం వద్ద నాలా దుస్థితి
ముగ్గురు గల్లంతై నాలుగు రోజులు
ఇప్పటికీ ఆచూకీ దొరకని దైన్యం
తిలా పాపం తలా పిడికెడు వైనం
రూ.కోట్లు ఖర్చయినా తీరని సమస్యలు