
హైదరాబాద్‌ను అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతాం
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచంలోనే హైదరాబాద్‌ను అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అధికారులు, ఉద్యోగుల నుద్దేశించి మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతం రాజరిక, నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజా పాలనకు అడుగులు పడ్డాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 50 వేలకు పైగా పేద కుటుంబాలకు ఇటీవల రేషన్‌కార్డులను పంపిణీ చేశామన్నారు. మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ ప్రక్షాళన, హై సిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే మేటి నగరంగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, అదనపు కమిషనర్లు కె. వేణు గోపాల్, గీతా రాధిక, సీసీపీ శ్రీనివాస్ , చీఫ్ ఇంజినీర్లు సహదేవ్ రత్నాకర్, నిత్యానంద్, విజిలెన్స్ ఏఎస్‌పీ సుదర్శన్ , డీఎస్పీ నరసింహరెడ్డి, ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం పాల్గొన్నారు.