అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలి | Governor Jishnu Dev Verma at the beginning of Traffic Summit: Telangana | Sakshi
Sakshi News home page

అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలి

Sep 19 2025 6:29 AM | Updated on Sep 19 2025 6:29 AM

Governor Jishnu Dev Verma at the beginning of Traffic Summit: Telangana

జ్యోతిప్రజ్వలన చేస్తున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ. చిత్రంలో కమిషనర్‌ సీవీ ఆనంద్‌

కొత్త ప్రాంతాలతోపాటు పాతబస్తీ కూడా అభివృద్ధి చెందాలి 

ట్రాఫిక్‌ సమ్మిట్‌ ప్రారంభంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ  

ట్రాఫిక్‌ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం 

రహదారిపై క్రమశిక్షణ ఉన్నచోటే ప్రాణానికి రక్షణ

సాక్షి, హైదరాబాద్‌: కొత్త నగరం, ఫ్యూచర్‌ సిటీతో పాటు పాతబస్తీ కూడా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన ‘సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌’ప్ర«దాన ఉద్దేశం అదేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పోలీసులు జలవిహార్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ సమ్మిట్‌–2025ను గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.  

ప్రజల ప్రవర్తనే కీలకం 
‘సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో కూడిన ట్రాఫిక్‌ నిర్వహణ అవసరం. గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో జాతీయ రహదారులు 60 శాతం విస్తరించాయి. రహదారిపై క్రమశిక్షణ ఉన్నచోటే ప్రాణానికి రక్షణ ఉంటుంది. హైదరాబాద్‌లోనే రోజుకు 1,500 వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అన్ని మెట్రోల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నేను ఈశా న్య భారతదేశంలో ఉన్న చిన్న రాష్ట్రమైన త్రిపురకు చెందినవాడిని. విద్యారి్థగా ఉన్నప్పుడు రాజధాని అగర్తలా మొత్తం కాలినడకన తిరిగా. కొందరు సైకిల్‌పై సంచరించే వాళ్లు. కానీ ఇప్పుడు అక్కడ కూడా ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతున్నాయి. పక్కనే ఉన్న మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లోనూ అదే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల ప్రవర్తన పైనే వాటి ఫలితాలు ఆధారపడి ఉంటాయి..’అని గవర్నర్‌ చెప్పారు.  

భద్రతలో ప్రతిఒక్కరూ భాగస్వాములు 
‘ప్రతి ఒక్కరూ ఆ భద్రతలో భాగస్వాములే. ట్రాఫి క్, రోడ్డు భద్రత కోణంలో బయటకు వెళ్లిన బిడ్డలు సురక్షితంగా తిగిరి వస్తారో? లేదో? అని భయపడే తల్లులు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి తల్లులు ఆందోళన లేకుండా, రోగి సమయానికి ఆసుపత్రికి, ఉద్యోగి కార్యాలయానికి ఇబ్బంది పడకుండా చేరే లా చేయడమే లక్ష్యం కావాలి. ప్రజలకు అవగాహన కల్పించడమంటే సమాచారం ఇవ్వడం కాదు. ప్రతి ఒక్కరూ అమలు చేసేలా కృషి చేయడం. ప్రజ లు కూడా ఓటు వేశాం కదా అంతా ప్రభుత్వం చూసుకుంటుందనే ధోరణి వీడాలి. టీ–హబ్, టీ–వర్క్స్‌ లాగా తెలంగాణ పోలీసు శాఖకు కూడా దేశమంతటికీ ఆదర్శం కావాలి. నేను నా రాష్ట్రానికి వెళ్లినప్పు డు తెలంగాణను ఆదర్శంగా తీసుకోమని అక్కడి ముఖ్యమంత్రికి చెప్తా..’అని గవర్నర్‌ అన్నారు. 

ట్రాఫిక్‌ ఓ పెనుసవాల్‌: సీవీ ఆనంద్‌ 
హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. ‘ట్రాఫిక్‌ నిర్వహణ పోలీసులకు ఓ పెనుసవాల్‌. పట్టణాలు, నగరాలకు వలసలు పెరగడమే దీనికి కారణం. ట్రాఫిక్‌ అంశంలో బెంగళూరు అ«ధ్వానమని అందరూ అంటారు. కానీ హైదరాబాద్‌ కూడా ఆ దిశలో వెళ్తోంది. ఇప్పటికే 92 లక్షల వాహనాలు ఉండటం, ప్రతిరోజూ కొత్తగా 1,500 వాహనాలు వచ్చి చేరుతుండటమే దీనికి కారణం..’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు విక్రమ్‌ సింగ్‌ మాన్, పి.విశ్వప్రసాద్, సంయుక్త సీపీ డి.జోయల్‌ డేవిస్, హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌కు చెందిన శేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement